‘రాహ్‌-వీర్’ బిరుదు...మీరు అందుకోవచ్చు...చేయాల్సింది ఇదే !

కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న రహదారి ప్రమాదాల మీద పూర్తి దృష్టిని సారించింది.;

Update: 2025-12-19 03:15 GMT

కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న రహదారి ప్రమాదాల మీద పూర్తి దృష్టిని సారించింది. ఈ విషయంలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే చాలా సీరియస్ గానే ఉన్నారు. ఆయన గతంలో కూడా అనేక సందర్భాలలో పెరిగిపోతున్న రోడ్ యాక్సిడెంట్ ల మీద ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. వీటిని ఏదో విధంగా నియంత్రించాల్సి ఉందని కూడా అన్నారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. దాంతో దుర్ఘటన జరిగిన ప్రదేశంలో ఆపదలో ఉన్న వారిని గోల్డెన్ పీరియడ్ లోగా రక్షించినంట్లు అయితే వారు ప్రాణాలతో నిలిచి ఉంటారన్నది ఆయన భావన. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త పధకాన్ని తీసుకుని వచ్చిందని లోక్ సభలో చర్చ సందర్భంగా గడ్కరీ వెల్లడించారు.

పార్లమెంట్ తీవ్ర ఆందోళన :

దేశంలో భారీ ఎత్తున జరుగుతున్న రహదారి ప్రమాదాలపై లోక్ సభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. దీని మీద కేంద్ర మంత్రి గడ్కరీ స్పందిస్తూ కేంద్రం అనేక రకాలుగా చర్యలు చేపడుతోంది అన్నారు. అంతే కాదు తమ తమ నియోజకవర్గాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పార్లమెంటు సభ్యులను కోరారు.

యువత బలి :

దేశంలో ఏటా ఏకంగా అయిదు లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. దీనివల్ల సగటున 1.8 లక్షల మంది మరణిస్తున్నారని వీరిలో 66 శాతం మంది 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులే ఉన్నారని గడ్కరీ చెప్పడం విశేషం. దేశం మొత్తం మీద ఉన్న జాతీయ రహదారులలో సుమారు ఏడు వేలకు పైగా బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు రహదారి ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా భావిస్తున్నామని, దానిని పరిష్కరించడానికి మొత్తం నలభై వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా నితిన్ గడ్కరీ లోక్ సభకు తెలియజేశారు.

రాహ్‌-వీర్’ పథకం :

కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రారంభించిన ‘రాహ్‌-వీర్’ పథకం కింద ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించే వారికి ‘రాహ్‌-వీర్’ బిరుదుతో పాటు పాతిక వేల రూపాయల దాకా నగదు బహుమతిని ఇచ్చి మరీ వారి సేవలను గుర్తించి సత్కరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తక్షణ చికిత్సకు ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం చెల్లింపులను సులభతరం చేయడం ఈ పధకం ఉద్దేశ్యంగా చెప్పారు. అలాగే రహదారి ప్రమాద బాధితులు ఆసుపత్రిలో చేరిన మొదటి ఏడు రోజుల పాటు ఒక్కో ప్రమాదానికి సంబంధించి ఒక్కో బాధితునికి 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సంరక్షణ కు అర్హత ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.

అప్‌గ్రేడ్ చేసిన అంబులెన్స్ సేవలు :

అంతే కాకుండా ఈ పధకం కింద అప్‌గ్రేడ్ చేసిన అంబులెన్స్ సేవలతో అనుసంధానించబడిన కేంద్రీకృత అత్యవసర హెల్ప్‌లైన్ కోసం ప్రణాళికలను రూపొందించామని కూడా కేంద్రమంత్రి వివరించారు. ఈ పధకం విషయంలో వివిధ రాష్ట్రాలతో ఒప్పందాల ద్వారా ప్రమాద స్థలాలకు వేగంగా చేరుకోవడానికి ఆధునిక అంబులెన్స్‌లను వినియోగిస్తామని ఆయన చెప్పారు ప్రమాదం జరిగిన ప్రాంతాలకు పది నిమిషాల కంటే తక్కువ సమయంలో స్పందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని గడ్కరీ చెప్పారు. ఎయిమ్స్ చేసిన ఒక అధ్యయనాన్ని కేంద్ర మంత్రి సభ దృష్టిలో ఉంచారు. సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు యాభై వేల దాకా రహదారి ప్రమాద మరణాలను నివారించవచ్చని గడ్కరీ తెలిపార్రు.

‘రాహ్‌-వీర్’ బిరుదు :

ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త పధకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగినపుడు ఆ పక్క్కగా వెళ్తున్న ఎవరైనా చొరవ తీసుకుని క్షతగాత్రుల గురించిన సమాచారం అందించడంతో పాటు వీలైతే వారిని కనుక సకాలంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళేలా చూసేందుకు ప్రోత్సహిస్తోంది. అలా చేయడం వల్ల ఏవరి మీద ఏ రకమైన లీగల్ కేసులు ఉండవు, వారిని ఎవరూ వేధించరు, ఎటువంటి వివరాలు కూడా అడగరు. చాలా మంది లీగల్ గా సమస్యలు వస్తాయన్న ఆలోచనతోనే ఎందుకొచ్చిన తంటా అనుకుని వదిలేసి పోతున్నారు. ఇక మీదట రహదారి ప్రమాద బాధితుల విషయంలో సక్రమంగా స్పందిస్తే కనుక ఆర్ధికంగా ప్రోత్సాహంతో పాటుజ్ ‘రాహ్‌-వీర్’ బిరుదు కూడా దక్కుతుంది. సో ఇది పౌరులకు దక్కే గొప్ప సత్కారంగా ఉంటుంది. ఇది మంచి పధకంగానే కాదు ప్రాణాలను రక్షించే గొప్ప ఆలోచనగా కూడా చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News