140 కిమీ వేగం.. గడ్కరీ జీ సీటు బెల్ట్ వద్దా? నెటిజన్ల ఆగ్రహం
కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వడోదర–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులను పరిశీలించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.;
కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వడోదర–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులను పరిశీలించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. రోడ్డు నాణ్యతను పరీక్షించే క్రమంలో ఆయన ప్రయాణించిన కారు ఏకంగా 140 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడం వీడియోలో కనిపించింది.. అయితే ఈ వీడియోలో గడ్కరీ సీటు బెల్ట్ ధరించకపోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
* హై స్పీడ్, నో బెల్ట్.. నెటిజన్ల విమర్శలు
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఒక కేంద్ర మంత్రి స్వయంగా అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా నియమాన్ని ఉల్లంఘించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “అంత వేగంతో ప్రయాణిస్తుంటే సీటు బెల్ట్ పెట్టుకోవడం ప్రాథమిక భద్రత కాదా? సీటు బెల్ట్ అలర్ట్ సౌండ్ కూడా స్పష్టంగా వినిపిస్తోంది. అది కూడా మంత్రికి వినిపించలేదా? “ప్రజలకు నియమాలు చెప్పే నాయకులే వాటిని పాటించకపోతే ఎలా? ఇది చాలా నిరాశపరిచింది.” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భద్రతా నిపుణులు కూడా స్పందిస్తూ 100 కి.మీ దాటిన వేగాల్లో చిన్నపాటి ప్రమాదం జరిగినా అది ప్రాణాంతకం అవుతుందని, అందువల్ల సీటు బెల్ట్ తప్పనిసరి అని గుర్తుచేశారు.
* ఎక్స్‌ప్రెస్‌వే నాణ్యతపై సంతృప్తి
నితిన్ గడ్కరీ ఎక్స్‌ప్రెస్‌వే పర్యటన ప్రధాన ఉద్దేశం రోడ్డు నిర్మాణ నాణ్యతను పరీక్షించడమే. అత్యధిక వేగంలోనూ పేవ్మెంట్ క్వాలిటీ, కంటిన్యూయస్ లేన్ స్మూత్‌నెస్, రోడ్డు డిజైన్ వంటి అంశాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో అత్యాధునిక రహదారులలో ఒకటిగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి చెందుతున్నందున, హైస్పీడ్ టెస్టింగ్ చేశామని అధికారులు వివరించారు.
* సేఫ్టీ రూల్స్ అందరికీ సమానమే
కేంద్ర మంత్రి లేదా సామాన్య పౌరుడు అనే తేడా లేకుండా రోడ్డు భద్రత నియమాలు అందరికీ సమానమే. 40 కిమీ వేగంలోనైనా, 140 కిమీ వేగంలోనైనా ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్ట్ మాత్రమే ప్రాణాలను కాపాడగల కీలకమైన భద్రతా సాధనం.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూపితే.. సాధారణ పౌరులు ట్రాఫిక్ నిబంధనలను పాటించే విషయంలో మరింత ఉదాసీనత పెరిగే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై గడ్కరీ చేసిన కృషికి ప్రశంసలు ఉన్నప్పటికీ, ఈ చిన్నపాటి నిర్లక్ష్యం మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.