నాసా రిపోర్ట్: నెమ్మదిగా కుంగుతున్న అతి పెద్ద సిటీ ప్రపంచ మ్యాప్ నుంచి మాయం?
మెక్సికో సిటీ ఇలా మునిగిపోవడానికి శతాబ్దాల నాటి భౌగోళిక కారణాలతో పాటు మానవ తప్పిదాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
అంతరిక్ష పరిశోధనలలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) తాజాగా ప్రపంచాన్ని వణికించే ఒక చేదు నిజాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని అత్యంత పెద్ద మెగా నగరాలలో ఒకటైన మెక్సికో సిటీ నెమ్మది నెమ్మదిగా భూమిలోకి కుంగిపోతూ.. భవిష్యత్తులో గ్లోబల్ మ్యాప్ నుంచే మాయమయ్యే ప్రమాదంలో పడిందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాసా -భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంయుక్తంగా ప్రయోగించిన అత్యాధునిక `నిసార్` ఉపగ్రహం పంపిన తాజా రిపోర్ట్ ప్రకారం.. ఈ నగర పరిసర ప్రాంతాలు నెలకు 3 సెంటీమీటర్ల (అర అంగుళం కంటే ఎక్కువ) వేగంతో.. అంటే ఏడాదికి సుమారు 30 నుండి 35 సెంటీమీటర్ల చొప్పున భూమిలోకి కుంగిపోతున్నాయి. అంతరిక్షం నుంచి తీసిన రాడార్ చిత్రాల ఆధారంగా వెలుగుచూసిన ఈ విపత్తు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మెక్సికో సిటీ ఇలా మునిగిపోవడానికి శతాబ్దాల నాటి భౌగోళిక కారణాలతో పాటు మానవ తప్పిదాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సుమారు రెండు కోట్ల (20 మిలియన్లు) జనాభా కలిగిన ఈ మహానగరం ఒక పురాతన సరస్సు గర్భంపై.. అత్యంత మెత్తటి నేలపైన నిర్మితమై ఉంది. గత వందేళ్లకు పైగా ఇక్కడి జనాభా అవసరాల కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం.. దానికి తోడు భారీ కాంక్రీట్ కట్టడాల బరువు పెరిగిపోవడంతో భూగర్భ పొరలు పూర్తిగా కుంచించుకుపోతున్నాయి. ఈ సమస్య ఎంత తీవ్రమైనదంటే నగరంలోని ప్రఖ్యాత 114 అడుగుల `ఏంజెల్ ఆఫ్ ఇండిపెండెన్స్` చారిత్రక చిహ్నం చుట్టూ ఉన్న నేల కుంగిపోవడం వల్ల... దానికి కాలక్రమేణా అదనంగా 14 మెట్లను నిర్మించాల్సి వచ్చింది. స్థానిక ఎకో సిస్టమ్ పూర్తిగా దెబ్బతినడం వల్ల దశాబ్దాల క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
అయితే ఈ భూమి కుంగిపోవడం అనేది నగరం మొత్తం ఒకేలా సమానంగా జరగకపోవడం వల్ల మౌలిక వసతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కొన్ని ప్రాంతాలు వేగంగా.. మరికొన్ని ప్రాంతాలు నెమ్మదిగా కుంగుతుండటంతో భూగర్భంలో ఉండే తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు పగిలిపోతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు, మెట్రో రైలు మార్గాలు, బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలకమైన మౌలిక వసతులు తీవ్రమైన పగుళ్లతో అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నిసార్ శాటిలైట్ అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 మధ్య సేకరించిన తాజా మ్యాప్‌లో తీవ్రంగా కుంగుతున్న ఈ ప్రాంతాలన్నీ స్పష్టమైన డార్క్ బ్లూ రంగులో దర్శనమిస్తూ ప్రమాద తీవ్రతను కళ్లకడుతున్నాయి.
ఈ భౌగోళిక మార్పులను కనిపెట్టడంలో 2025 జూలైలో ప్రయోగించిన ఎన్.ఐ.ఎస్.ఏ.ఆర్ శాటిలైట్ సాంకేతికత ఒక మైలురాయిగా నిలిచింది. దట్టమైన మేఘాలు, వర్షం లేదా అడవులు అడ్డుగా ఉన్నప్పటికీ భూమి ఉపరితలంలో జరిగే మిల్లీమీటర్ స్థాయి మార్పులను సైతం దీనిలోని డ్యూయల్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్.ఏ.ఆర్) వ్యవస్థ ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. ప్రతి 12 రోజులకు రెండుసార్లు భూమిని పర్యవేక్షించే ఈ ఉపగ్రహం భవిష్యత్తులో సముద్ర మట్టాలు పెరుగుతూ.. భూమి కుంగిపోతున్న ఇతర ప్రపంచ తీరప్రాంత నగరాలను కూడా ముందే హెచ్చరించడానికి ఉపయోగపడనుంది. తుఫానులా ఒక్కసారిగా కాకుండా.. నిశ్శబ్దంగా నగరాల పునాదులను కదిలించే ఇటువంటి విపత్తుల విషయంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ డేటా శాస్త్రవేత్తలకు ఒక దిక్సూచిలా మారింది.
మెక్సికో సిటీ ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ ముప్పు కేవలం ఆ దేశానికే పరిమితం కాదు.. సుదీర్ఘమైన తీరప్రాంతం కలిగి భూగర్భ జలాలను విపరీతంగా వాడుతున్న భారతదేశంలోని ప్రముఖ బీచ్ నగరాలకు కూడా ఇది ఒక గట్టి హెచ్చరిక. కేంద్ర భూగర్భ జల బోర్డు రిపోర్ట్ ప్రకారం మనదేశంలో చెన్నై (127 శాతం అతిగా వాడకం), ముంబై, విశాఖపట్నం, కొచ్చి, పూరి, పుదుచ్చేరి వంటి పర్యాటక, పారిశ్రామిక తీరప్రాంత నగరాల్లో కూడా భూగర్భ జలాల నిల్వలు ప్రమాదకరంగా క్షీణిస్తున్నాయి. ఈ నగరాల్లో భూమి కుంగిపోయే ప్రమాదంతో పాటు.., సముద్రపు ఉప్పునీరు భూగర్భంలోకి చొచ్చుకువచ్చే ముప్పు పొంచి ఉంది. కాబట్టి మెక్సికో సిటీ ఉదంతాన్ని ఒక పాఠంగా తీసుకుని ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా నీటి వనరుల సంరక్షణపై తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.