తుర్కియే కోసం రూపాయి కూడా ఖర్చు చేయొద్దు : హీరో నిఖిల్ సంచలన పిలుపు

భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం భారతీయ పౌరులు డబ్బు ఖర్చు చేయకూడదని ఆయన సూచించారు.;

Update: 2025-05-14 09:24 GMT

భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై టాలీవుడ్ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం భారతీయ పౌరులు డబ్బు ఖర్చు చేయకూడదని ఆయన సూచించారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

నిఖిల్‌ తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక నెటిజన్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "మంచి లేదా చెడు పాక్‌తో మేము సత్సంబంధాలు కొనసాగిస్తాం" అంటూ ఎర్డోగాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన నిఖిల్‌, "ఇంకా ఎవరైనా తుర్కియే వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే దయచేసి ఈ పోస్ట్‌ను ఒకసారి చూడండి. భారతీయలు ప్రతి సంవత్సరం తుర్కియేలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి కోసం మీ కష్టార్జితాన్ని ఖర్చు చేయడం దయచేసి ఆపండి" అని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ గతంలో చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' సమయంలో తుర్కియే పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మరణించిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడి జరిగిన తర్వాత చాలా దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించగా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలవడం వివాదాస్పదమైంది. పహల్గాం దాడిని ఆయన ఖండించకపోవడం, మృతిచెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఇష్టపడకపోవడంపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎర్డోగాన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన భారతీయ నెటిజన్లు గతంలో 'బాయ్‌కాట్ తుర్కియే' పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.

తాజాగా నిఖిల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు, భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల పట్ల భారతీయ పౌరులు ఎలా వ్యవహరించాలనే దానిపై మరోసారి చర్చకు తెరలేపాయి.

Tags:    

Similar News