సరికొత్తగా: డిస్కౌంట్ ఆఫర్లు వినే ఉంటారు.. నిడదవోలు షాపు మాదిరైతే కాదు

పండుగ వేళలో డిస్కౌంట్లు.. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు పలు షాపులు కొత్త కొత్తగా ప్రకటనలు చేయటం చూస్తుంటాం.;

Update: 2026-01-05 07:56 GMT

పండుగ వేళలో డిస్కౌంట్లు.. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు పలు షాపులు కొత్త కొత్తగా ప్రకటనలు చేయటం చూస్తుంటాం. అయితే.. ఇప్పటివరకు మరెవరూ చేయని సరికొత్త ప్రయోగాన్ని నిడదవోలులోని ఒక బట్టల షాపు చేసింది. ఈ షాపు వారు చేసిన ప్రకటన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. సాధారణంగా 10 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ సేల్ చూస్తుంటాం. కొన్ని ప్రముఖ రిటైల్ చైన్ సంస్థలైతే.. 100 శాతం డిస్కౌంట్ తో వస్త్రాల్ని అమ్ముతున్నట్లుగా భారీ ప్రకటనలు ఇవ్వటం చూశాం. అయితే.. దీనికి షరతులు వర్తిస్తాయన్న ట్యాగ్ ఉంటుంది.

ఇలాంటిదేమీ లేకుండా సింఫుల్ గా.. సరికొత్తగా.. ఎలాంటి షరతులు లేకుండా కస్టమర్లకు సరికొత్త డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జీఎల్ఆర్ షాపింగ్ మాల్. వీరి తాజా ఆఫర్ చాలా సింఫుల్. తమ షాపులో కొనుగోలు చేసే వినియోగదారుడి బరువుకు అనుగుణంగా డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

అదెలా అంటారా? ఆ లెక్కలోకి వెళితే.. ఈ షాపులో కొనుగోలు చేసే వారి బరువును వెయింగ్ మెషీన్ తో కొలుస్తారు. వారు ఉన్న బరువులో సగం డిస్కౌంట్ అందిస్తామని ప్రకటించారు. అంటే.. 70 కేజీలు బరువు ఉన్న వారికి 35 శాతం.. 80 కేజీలు ఉన్న వారికి 40 శాతం.. అదే 50 కేజీలు ఉన్న వారికి పాతిక శాతం రాయితీని ప్రకటించారు. ఇలా బరువును కొలిచి.. అందులో సగం బరువుకు డిస్కౌంట్ ప్రకటించిన షాపు ప్రయోగం పలువురిని ఆకర్షిస్తోంది. వ్యాపార వర్గాల్లో ఇదో ఆసక్తికర చర్చగా మారింది. అయితే.. ఇక్కడో మెలిక ఉందని చెబుతున్నారు.

డిస్కౌంట్ వరకు వినూత్నంగా ఉన్నప్పటికి.. వస్త్రాల ధరలు ఎలా ఉన్నాయన్నదే అసలు ప్రశ్న. మామూలుగా అయితే.. కొన్ని షాపుల వారు తమ షాపులోని వస్త్రాలపై ధరల్ని భారీగా ప్రింట్ చేసి.. వాటికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటిస్తారు. ఇలాంటి తీరుతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకు భిన్నంగా కొందరు మాత్రం వస్త్రాల ధరల్ని అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో ఉంచి.. దాని మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఇలాంటి వాటికి వినియోగదారుల్లో మంచి స్పందన ఉంటుంది. నిడదవోలు షాపు విషయంలోకి వెళితే.. ఆ షాపు వారు ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ వినూత్నంగా ఉందన్నది మాత్రమే పాయింట్. వారి షాపులో వస్త్రాల ధరలు ఎలా ఉన్నాయి? అన్న దానిపై మాత్రం వినియోగదారులు ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సిందే.

Tags:    

Similar News