ఉప రాష్ట్రపతిగా బీసీ నేత? దక్షిణాది వారికే అవకాశం

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా తర్వాత తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించే నేత ఎవరు? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది.;

Update: 2025-08-03 09:01 GMT

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా తర్వాత తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించే నేత ఎవరు? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో కాబోయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నేతను ఎంపిక చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తోపాటు బిహార్ కు చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా త్వరలో భర్తీ చేయనుండటం, బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు కేటాయించొచ్చన్న ఊహాగానాలతో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారుతోంది.

ప్రస్తుతం ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఉప రాష్ట్రపతిగా బీసీ నేతను ఎంపిక చేయొచ్చని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీ దక్షిణాది ప్రాంతానికి చెందిన బీసీలకు అవకాశం ఇవ్వాలని సంఘ్ పరివార్ ప్రతిపాదిస్తోందని అంటున్నారు. రాజీనామా చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఓబీసీ వర్గానికి చెందిన వారు. అదేవిధంగా రాష్ట్రపతిగా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక ఎస్సీ, ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది. ఉప రాష్ట్రపతి పదవిని గతంలో ఒకసారి అగ్రవర్ణాలకు కేటాయించగా, రెండోసారి బీసీ వర్గానికి చెందిన జగదీష్ ధన్ ఖర్ కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీ రాజీనామా చేసిన ఉప రాష్ట్రపతి పదవిని మళ్లీ అదే వర్గానికి కేటాయించడం సముచితమంటూ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

ఇక ఉప రాష్ట్రపతి అంటే ఐదేళ్ల తర్వాత రాజకీయ విరామం తీసుకోవాల్సిందేనన్న భావనతో కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కేంద్ర మంత్రి వర్గంలో చక్రం తిప్పిన వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతిని చేశారు. ఐదేళ్ల పదవీకాలం తర్వాత ఆయనను రాష్ట్రపతిగా ప్రమోట్ చేయలేదు. దీంతో ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఈ కారణంతోనే జేపీ నడ్డా, రాజనాథ్ సింగ్ వంటి వారు ఉప రాష్ట్రపతి పదవిపై సముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.

దీంతో ఉప రాష్ట్రపతి పదవికి తగిన బీసీ నాయకుడి ఎంపిక కోసం బీజేపీ పెద్దలు జల్లెడ పడుతున్నట్లు చెబుతున్నారు. దక్షిణాదికి చెందిన బీసీ నేతను ఎంపిక చేయాలని భావిస్తుండటంతో హరియాణా మాజీ గవర్నర్ దత్తాత్రేయ పేరు తెరపైకి వచ్చింది. ఆయన గవర్నర్ గిరీ గత నెలలోనే ముగిసింది. ఆయన స్థానంలో బీజేపీ అషిమ్ కుమార్ ఘోష్‌ను నియమించింది. దీంతో ప్రస్తుతం దత్తాత్రేయ ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్నారు. దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేస్తే ఏకగ్రీవం అయ్యేలా సహకరిస్తామని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో దత్తాత్రేయ పేరు ప్రముఖంగా చర్చకు వస్తోంది. అన్నిపార్టీలతో సత్సంబంధాలు ఉన్న దత్తాత్రేయకు సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. అదే సమయంలో గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసివస్తోందని అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ, సంఘ్‌తో దత్తాత్రేయకు చాలాకాలంగా అనుబంధం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి పదవికి దత్తాత్రేయ తగిన వారు అన్న ప్రచారం వినిపిస్తోంది.

Tags:    

Similar News