ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన అధినేతకు క్యాన్సర్ ట్రీట్ మెంట్

ప్రారంభ దశలోనే క్యాన్సర్ కు చికిత్స తీసుకోవటంతో ప్రస్తుతం తాను ఆరోగ్ంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు చికిత్స సాగుతుందన్నారు. ఏడాదిన్నర క్రితం తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లుగా పేర్కొన్నారు.;

Update: 2026-04-25 05:23 GMT

చరిత్ర పుస్తకాల్ని చదివినప్పుడు కొన్ని అంశాలు చాలా ఆశ్చర్యకరంగా.. విస్మయానికి గురి చేసేలా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేయటం.. కోట్లాది మంది ప్రజలు బతకాలో.. చావాలో అన్నది ఎలా డిసైడ్ చేస్తాడు? ఒకవేళ అతగాడు డిసైడ్ చేస్తే.. యావత్ ప్రపంచం గుడ్డిగా దాన్ని ఎందుకు ఫాలో కావాలి? ఎంతోమంది దేశాధినేతలు ఉన్నప్పుడు.. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అధినేతను కట్టడి చేయలేరా? లాంటి సందేహాలు వస్తాయి. కానీ.. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తే.. చరిత్రపై తమకున్న సందేహాలు ఇట్టే తీరిపోయే పరిస్థితి.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇజ్రాయల్ అధినేత యుద్ధకాంక్ష.. ఇరాన్ సంగతి తేల్చేయాలన్న పంతం.. అందుకు ట్రంప్ లాంటి అధినేత అమెరికా దేశాధ్యక్షస్థానంలో నిలవటం.. వారిద్దరూ కలిసి ఇరాన్ మీద యుద్ధానికి దిగటం.. దానికి ప్రపంచం మొత్తం ఆగమాగం కావటం చూస్తున్నదే. ఐక్యరాజ్యసమితి మొదలు బలమైన యూరోపియన్ దేశాలు.. చైనా, రష్యా లాంటి దేశాలు ఉన్నప్పటికి ఓపెన్ గా అగ్రరాజ్యాన్ని.. ఇజ్రాయెల్ దూకుడుకు బ్రేకులు వేయలేనితనం.. అందుకు ప్రతిగా ప్రపంచంలోని కోట్లాది మంది యుద్ద ఫలితాల్ని భరించాల్సి రావటం తెలిసిందే.

ఆధునిక ప్రపంచంలో యుద్దానికి మించిన తెలివితెక్కువ పని మరొకటి ఉందని మేధావులు మొత్తుకుంటున్నా.. వారి మాటల్ని పెడచెవిన పెట్టి ఇరాన్ అంతు చూసేందుకు కత్తులు నూరిన అమెరికా, ఇజ్రాయెల్ కు తత్త్వం అంతో ఇంతో బోద పడింది. అదే సమయంలో.. వీరి పంచాయితీతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్నో దేశాలు ఈ యుద్ధం కారణంగా తీవ్ర అవస్థలకు గురైన దుస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కీలకమైన యుద్ధం వేళ.. ఈ మొత్తం పంచాయితీకి కీలకమైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. కొంతకాలంగా తాను ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. తాజాగా తాను క్యాన్సర్ భూతాన్ని జయించినట్లుగా వెల్లడించారు. ఇరాన్ తో జరుగుతున్నయుద్ధం కారణంగా తన చికిత్స గురించి ముందుగా వెల్లడించలేదన్న ఆయన.. తన ఆరోగ్య సమస్యను అసరాగా చేసుకొని టెహ్రాన్ తప్పుడు వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉండటంతో.. తన ఆరోగ్య సమస్యను గుట్టుగా ఉంచినట్లు పేర్కొన్నారు,

ప్రారంభ దశలోనే క్యాన్సర్ కు చికిత్స తీసుకోవటంతో ప్రస్తుతం తాను ఆరోగ్ంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు చికిత్స సాగుతుందన్నారు. ఏడాదిన్నర క్రితం తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లుగా పేర్కొన్నారు. అప్పటి నుంచి తాను చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. ఇటీవల తనకు విజయవంతంగా సర్జరీ జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పిన నెతన్యాహు.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని వెంటనే పరిష్కరించుకునే సిద్ధాంతాన్ని తాను ఫాలో అవుతానని వెల్లడించారు,

వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వ్రత్తిలోనూ అదే విధానాన్ని తాను పాటిస్తానని చెప్పారు. తనకు ఎదురైన క్యాన్సర్ సవాలు విషయంలోనూ ఇదే సూత్రాన్ని తాను పాటించినట్లు వెల్లడించాు. తనకు చికిత్స చేసిన జెరూసలెంలోని హదాస్సా ఆసుపత్రి వైద్యులకు థ్యాంక్స్ చెప్పిన నెతన్యాహు..అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని.. ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించాలన్న సూచన చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి ఇంతలా చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని.. ప్రపంచానికి తాను అంటించిన యుద్ధ భూతం గురించి.. దాని కారణంగా కోట్లాది మంది ప్రజలు పడుతున్న వెతల గురించి ఆలోచిస్తే.. అనవసర ఉద్రిక్తతలు తొలిగే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని ఆలా ఆలోచించే అవకాశం ఉందంటారా?

Tags:    

Similar News