మంత్రి లోకేశ్ కి షాకింగ్ లాంటి వార్త... ఇంకా నేపాల్ లోనే టీడీపీ ముఖ్యనేత కుటుంబం?
నేపాల్ వెళ్లిన యాత్రికులను క్షేమంగా తీసుకువచ్చామని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ తెలిసింది.;
నేపాల్ వెళ్లిన యాత్రికులను క్షేమంగా తీసుకువచ్చామని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ తెలిసింది. తీర్థయాత్రల నిమిత్తం నేపాల్ వెళ్లిన ఏపీ యాత్రికులు సుమారు 217 మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా రెండు రోజుల క్రితం తీసుకువచ్చారు. సుమారు 36 గంటల పాటు శ్రమించి తెలుగు యాత్రికులకు ధైర్యం కల్పించి క్షేమంగా తీసుకువచ్చిన ప్రభుత్వానికి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబం కూడా నేపాల్ లో చిక్కుకున్నట్లు ఆలస్యంగా తెలిసిందని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోపాటు వారితో వెళ్లిన వారిని క్షేమంగా రప్పించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. అల్లరి మూకలు ఆమె బస చేసిన హోటల్ పై దాడి చేసి సుజాతమ్మ ఫోన్ ను ధ్వంసం చేయడం వల్ల ఆమె క్షేమ సమాచారం వెంటనే తెలియరాలేదు. సుజాతమ్మతోపాటు పలువురు డోన్ వాసులు నేపాల్ పర్యటనకు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే నేపాల్ లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం ఆర్టీజీఎస్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసినా, మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్న విషయం ఎందుకు తెలియలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది.
నేపాల్లో సోషల్ మీడియా నిషేధంపై ఆగ్రహించిన జెన్ జడ్ యువత ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రమై హింసకు దారితీయగా పోలీసు కాల్పుల్లో దాదాపు 20 మంది మరణించారు. ఇంకా వందల మంది గాయపడ్డారు. అయితే పోలీసు చర్యలను నిరసిస్తూ అల్లరి మూకలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై దాడులకు దిగాయి. ఈ క్రమంలో హోటళ్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా ఆందోళనకారులు దాడులకు దిగడంతో మన దేశం నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన వారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సివచ్చింది.
అయితే తమ పరిస్థితిని వివరిస్తూ కొందరు వీడియో సందేశాలు పంపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి, నేపాల్ లో చిక్కుకున్న వారందరినీ ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి తీసుకురావాల్సిందిగా మంత్రి లోకేశ్ ను ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీజీఎస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసి నేపాల్లో వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని గురువారం క్షేమంగా తీసుకువచ్చారు. అయితే డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఫోన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె సమాచారం అప్పుడు తెలియలేదని చెబుతున్నారు. శుక్రవారం ఈ విషయం వెలుగు చూడటంతో ఆమె ఎక్కడున్నది తెలుసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం ప్రారంభించింది. నేపాల్ లో ఉన్న విదేశాంగ అధికారులను అప్రమత్తం చేసి మాజీ ఎమ్మెల్యేతోపాటు ఆమెతో పాటు వెళ్లిన వారందరినీ క్షేమంగా తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది.