కళ్ళ ముందే మహా ప్రళయం...ప్రకృతి ఆగ్రహించిన వేళ !
ప్రకృతి ముందు మనిషి ఎంత అన్న ప్రశ్న ఎపుడూ వస్తూ ఉంటుంది. మనిషి ఎన్నో ఆలోచనలు చేయవచ్చు. ఎంతగానో సాంకేతికతను తన విజ్ఞానంతో అభివృద్ధి చేయవచ్చు.
ప్రకృతి ముందు మనిషి ఎంత అన్న ప్రశ్న ఎపుడూ వస్తూ ఉంటుంది. మనిషి ఎన్నో ఆలోచనలు చేయవచ్చు. ఎంతగానో సాంకేతికతను తన విజ్ఞానంతో అభివృద్ధి చేయవచ్చు. కానీ ప్రకృతి ముందు మనిషి ఎపుడూ ఏమీ కాడు. అది పదే పదే రుజువు అవుతూనే ఉంది. మరో మారు కూడా ప్రకృతి చాటి చెప్పింది. భయంకరమైన జల విలయాన్ని నేపాల్ టిబెట్ సరిహద్దులలో అంతా చూశారు. అక్కడ ఉన్న వారు అయితే జల సమాధి అయిపోయారు. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుని పోయాయి. కట్టలు తెచ్చుకుని వచ్చిన వరదలు కరాళ నృత్యమే చేశాయి. దాంతో నేపాల్ లో హృదయ విదారక దృశ్యాలు వీడియోలు మీడియాలో చూసిన ప్రపంచం అంతా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఉన్నట్టుండి ముంచేసింది :
ఇదిలా ఉంటే నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల సంభవించిన ఆకస్మిక వరదలతో భారీ జల ప్రళయం ఏర్పడింది. దాంతో ప్రాథమిక అంచనాల మేరకు చూస్తే కనుక సుమారు 95 మందికి పైగా మరణించారని అంటున్నారు. అంతే కాదు వందలాది మంది జల విలయంలో చిక్కుకుని గల్లంతయ్యారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం నుంచి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ విలయం సంభవించింది అని అంటున్నారు. భోటే కోషి, త్రిసూలీ నదులు ఈ పరిణామంతో ఒక్కసారిగా పోటెత్తాయి. అవి ఉధృతంగా ప్రవహిస్తూ దూకుడు చేస్తూ నదీ తీర ప్రాంతాన్ని అంతా ముంచేశాయి. దాంతో ఈ ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. కనీసంగా వంద మంది దాకా మృతి చెందగా వందల సంఖ్యలో పర్యాటకులు స్థానికులు ఆచూకీ లేకుండా పోయారని అంటున్నారు. ఇలా గల్లంతైన వారిలో కూడా వందకు పైగా భారతీయులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
భయోత్పాతం సృష్టించాయి :
ఇదిలా ఉంటే ఈ ఆకస్మిక వరదలతో ప్రాణ నష్టంతో పాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. రోడ్లు, వంతెనలు, పెద్ద ఎత్తున భవనాలు, హోటళ్లు జల విద్యుత్ ప్రాజెక్టులు సైతం వరద నీటిపాలయ్యాయి.ఈ ఆకస్మిక వరదల నేపధ్యంలో రెస్క్యూ టీమ్‌లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు చూస్తే భారత్ కూడా అప్రమత్తం అయింది. నేపాల్ త్రిసూలీ పరివాహక ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన బిహార్ ఉత్తర ప్రదేశ్‌లలో హై అలర్ట్ ని జారీ చేశారు. ఇక టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదికి పొంగిపొర్లిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌లో దాదాపు 500 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. ఆకస్మిక వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 46 మృతదేహాలను వెలికితీసినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
గల్లంతైన విదేశీయులు :
ప్రభావిత ప్రాంతాలలోని వివిధ భాగాల నుండి కనీసం 93 మందిని రక్షించినట్లు వారు చెప్పారు. గల్లంతైన వారిలో కనీసం 105 మంది భారతీయులు 37 మంది ఎన్నారైలు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో చాలా మంది టిబెట్‌లోని కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైన విదేశీయులు యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, మలేషియా, దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌తో సహా పలు దేశాలకు చెందినవారని అధికారులు చెబుతున్నారు.
భూకంపం కారణంగానేనా :
ఇదిలా ఉంటే ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం కారణంగా సంభవించిన హిమ పాతం వల్ల కరిగిన మంచు నీరు భోటే కోషి నదిలోకి ప్రవహించి ఈ ఆకస్మిక వరదను సృష్టించింది. భోటే కోషి నదిలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలు రసువా ప్రాంతంలో తీవ్ర అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని పర్యాటకులు ఇతర ప్రజల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి. అధికారులు సహాయక సంస్థలు పరిస్థితిని అంచనా వేయడానికి గల్లంతైన వారి ఆచూకీని కనుగొనడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. నేపాల్ టూరిజం బోర్డు, పర్యాటకులు వారి కుటుంబాలు సమాచారం లేదా సహాయం కోరడానికి అత్యవసర సంప్రదింపు నంబర్లను కూడా జారీ చేసింది.