కాంగ్రెస్ సెంటిమెంట్... వైసీపీ బ్యాక్ బౌన్స్ అవుతుందా ?

కాంగ్రెస్ నుంచి వేరు పడి కొత్తగా ఏపీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్.

Update: 2026-08-27 00:41 GMT

కాంగ్రెస్ నుంచి వేరు పడి కొత్తగా ఏపీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. అయితే వైసీపీలో జగన్ తో సహా అత్యధికులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే అన్నది తెలిసిందే. వైసీపీలో కూడా కాంగ్రెస్ పేరు ఉంది. చాలా మటుకు ఆ పార్టీ విధానాలు ఆలోచనలు కాంగ్రెస్ ని పోలి ఉంటాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా వైసీపీ వెంట ఉంది. వైసీపీ ఏర్పాటు తరువాతనే కాంగ్రెస్ ఏపీలో కనుమరుగు అయింది అంటే వైసీపీ ఖద్దరు పార్టీకి మారు రూపం అన్న భావన బలంగా ఉండటమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ తోనే తొలి పోరుని మొదలెట్టిన టీడీపీ 2009 దాకా అంటే పాతికేళ్ళ పాటు ఆ పార్టీతోనే ఉమ్మడి ఏపీలో రాజకీయంగా ఢీ కొట్టింది.

కాంగ్రెస్ కనుమరుగు :

ఇదిలా ఉంటే విభజన ఏపీకి వచ్చేసరికి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది. టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కడా చెక్కు చెదరలేదు, కాంగ్రెస్ మాత్రం కనుమరుగు అయింది. ఇపుడు వైసీపీతోనే టీడీపీ సమరం సాగిస్తూ రాజకీయంగా పై చేయి సాధించేందుకు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య మరోసారి హోరా హోరీ పోరుకు తెర లేస్తోంది. ఇక చూస్తే కనుక 2013లో జరిగిన స్థానిక పోరు ఉమ్మడి ఏపీ కేంద్రంగా సాగింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ నాడు పరోక్ష పద్దతిలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇక 2014లో టీడీపీ విభజన ఏపీలో అధికారంలోకి వచ్చింది. కానీ అయిదేళ్లలోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో స్థానిక సమరం సాగింది. వైసీపీ నూటికి తొంభై శాతం ఫలితాలు అధికారంలో ఉండటంతో సాధించింది. ఇపుడు అదే విధంగా టీడీపీ కూటమి కూడా గెలవాలని చూస్తోంది.

డైరెక్ట్ ఎన్నికలు అంటే :

అయితే ప్రత్యక్ష ఎన్నికలు అంటే టీడీపీకి కొంత ఇబ్బందిగానే ఉంటాయని గతంలో జరిగిన ఉదంతాలు నిరూపించాయి. టీడీపీ మొదటి నుంచి ప్రత్యక్ష ఎన్నికలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. టీడీపీ 1983లో అధికారంలోకి వచ్చాక 1987లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అప్పట్లో కొత్తగా ఏర్పాటు చేసిన మండల పరిషత్తుల చైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు పెట్టింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే పట్టణాలలో మున్సిపల్ చైర్మన్లను కాంగ్రెస్ బాగానే గెలుచుకుంది. ఇక 1994లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. బంపర్ మెజారిటీతో డిసెంబర్ లో టీడీపీ గెలిస్తే కేవలం మూడు నెలల వ్యవధిలో అంటే 1995 మార్చిలో స్థానిక ఎన్నికలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పెట్టారు. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అయితే టీడీపీకి దక్కలేదు, కేవలం 26 అసెంబ్లీ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుడా ఉమ్మడి ఏపీలో చతికిలపడిన కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయింది. ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే కాకుండా మేయర్ పదవులు కూడా దక్కించుకుంది. అలా విశాఖ మేయర్ కూడా కాంగ్రెస్ పరం అయింది. చంద్రబాబు సీఎంగా ఉండగా 2000లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బాగానే పుంజుకుంది.

వైసీపీ ఆశలు అవే :

ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిన ప్రతీ సారి టీడీపీకి కొంత ఇబ్బంది జరుగుతూ వస్తోంది. గతంలో ఫలితాలు పొలిటికల్ ట్రాక్ రికార్డు అదే నిరూపిస్తోంది. అందుకే వైసీపీ ఈ విషయంలో ఆశలు పెట్టుకుంది. జగన్ కూడా డైరెక్ట్ ఫైట్ అయితే మేలు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. పార్టీ నాయకులతో ఆయన అదే చెప్పారు. బలమైన అభ్యర్థి రంగంలోకి దించితే డైరెక్ట్ ఫైట్ లో మేయర్ జెడ్పీ మునిసిపల్ చైర్మన్లు మండల పరిషత్తులలో గణనీయంగా గెలుచుకుంటామని జగన్ గట్టిగానే చెబుతున్నారు. కాంగ్రెస్ సెంటిమెంట్ తో పాటు ట్రాక్ రికార్డుతోనే వైసీపీ ఈ రకంగా నమ్మకం పెట్టుకుంది అని అంటున్నారు. మరి వైసీపీ నమ్మకం నిజమవుతుందా, అప్పట్లో కాంగ్రెస్ పుంజుకున్న మాదిరిగానే వైసీపీ బలపడుతుందా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News