నేపాల్ అల్లర్ల పేరిట దోచేస్తున్నారు.. బిలియనీర్ ఇల్లు లూటీ వీడియో వైరల్
నేపాల్‌లో శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చుతున్నాయి.;
నేపాల్‌లో శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చుతున్నాయి. సోషల్ మీడియాపై విధించిన నిషేధం జెన్-జెడ్ తరం యువతలో ఆగ్రహాన్ని రగల్చగా.. ఆ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా, సైన్యం కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాల్సి వస్తోంది.
ఈ అల్లర్ల మధ్య, నేపాల్‌లో మూడో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన బిలియనీర్ ఉపేంద్ర మహతో ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి నివాసంలో లూటీ, ధ్వంసం జరిగిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. దాడి జరిగిన సమయంలో మహతో మాస్కోలో ఉన్నారని సమాచారం.
ఇంతటితో ఆగకుండా అనేక వ్యాపార సంస్థలను కూడా ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. పగటిపూట ఒక సూపర్ మార్కెట్‌పై దాడి చేసి పురుషులు, మహిళలు కలిసి లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది అల్లరి మూకలు వ్యాపార సంస్థలు, మాల్స్, ధనికుల ఇళ్లు, గోదాములను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. బయట శక్తుల ప్రేరేపణ, అంతర్గత అసంతృప్తి కలిసిపోవడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
కాఠ్మాండు, పోఖరా వంటి పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు, హై-ఎండ్ షాపులు, ధనికుల ఇళ్లలో దోపిడీలు జరిగినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల బ్యాంకులు, ఏటీఎంలపై కూడా దాడులు జరిగినట్టు సమాచారం.
* జెన్-జెడ్ విద్యార్థుల వాదన
స్మార్ట్‌ఫోన్‌లో మమేకమైన సోషల్ మీడియా యాప్స్‌ను ప్రభుత్వ ఆంక్షలతో నిలిపివేయడం తమ ఆత్మను తుడిచివేయడమేనని జెన్-జెడ్ యువత అంటోంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాస జీవనం తమ దేశాన్ని కుదేలుచేస్తోందని ప్రశ్నించేందుకే శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టామని వారు స్పష్టం చేస్తున్నారు.
అయితే మూడు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఖండించాయి. రాజకీయ అవకాశవాదులు తమ ఉద్యమాన్ని వాడుకొని నిరసనలలోకి చొరబడటమే ఈ హింసకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.
* పరిస్థితి ఆందోళనకరం
ఒకవైపు సైన్యం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, మరోవైపు ప్రజలలో భయం, అనిశ్చితి పెరుగుతోంది. బిలియనీర్ ఇల్లు దాడి ఘటన నేపాల్ ఆర్థిక వర్గాలను కుదిపేసింది. శాంతియుత నిరసనల వెనక దాగి ఉన్న రాజకీయ లెక్కలే దేశాన్ని ఈ స్థితికి నెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నేపాల్‌లో అల్లర్లు, దోపిడీలు కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ భవిష్యత్తు ఎటు దారితీస్తుందన్న అనిశ్చితి పెరిగిపోతోంది.