నెల్లూరులో గంజాయి బ్యాచ్ దురాగతం.. టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద దుమారం
నెల్లూరులో సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ హత్యకు గంజాయి ముఠాయే ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు.;
నెల్లూరులో సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ హత్యకు గంజాయి ముఠాయే ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితులకు రాజకీయ సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెంచలయ్యను హత్యకు గంజాయి ముఠాను నడిపే ఓ మహిళ కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆ మహిళ తన వ్యాపారం కోసం రాజకీయ నాయకులతో క్లోజుగా తిరగడమే ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రోద్బలంతోనే నిందితురాలు అరవ కామాక్షమ్మ గంజాయి విక్రయిస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో కోటంరెడ్డిపై సస్పెన్షన్ విధించిన తర్వాత నిందితురాలిని వైసీపీలో చేర్చుకున్నారని, అప్పట్లో ఆమె ఫొటోతో ముద్రించిన పోస్టరును టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో నిందితురాలికి ఏ పార్టీతో సంబంధం ఉందనేది పెద్ద చర్చకు దారి తీసింది. అయితే గంజాయి మూకలు రాజకీయం ముసుగులో దందా కొనసాగిస్తున్నట్లు ఈ ఎపిసోడ్ ద్వారా తేటతల్లమైందని అంటున్నారు.
గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను అత్యంత పాశవికంగా మర్డర్ చేయడం నెల్లూరు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనతో అధికార పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అదుపు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి వనాలను పూర్తిగా ధ్వంసం చేశామని, ప్రత్యేక టాస్క్ ఫోర్సు ద్వారా విక్రయాలను కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న వ్యక్తి హత్యకు గురికావడమే ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లైంది.
ఇక నిందితురాలు కామాక్షమ్మ కుటుంబం మొత్తం గంజాయి విక్రయాలనే ప్రధాన వ్యాపకంగా చేసుకుని నగరంలో దందాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తుకుండా చూసుకుంటోందని అంటున్నారు. నగరంలో యువత, విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్న కామాక్షమ్మపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. నవాబుపేట పోలీసుస్టేషన్ లో ఆమె సస్పెక్ట్ షీటు కూడా నమోదు చేశారు. కామాక్షమ్మ సోదరులపై కూడా సస్పెక్ట్ షీట్సు ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం పాత ఇనుము, చెత్త కొనుగోలు వ్యాపారం చేస్తున్న పెంచలమ్మ.. ఆ మాటున గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఆమె కార్యకలాపాల వల్ల యువత చెడుదారిలో నడుస్తుందని గ్రహించిన పెంచలయ్య.. పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల అతడి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఇక పెంచలయ్య హత్య తర్వాత కామాక్షమ్మ ముఠా పరార్ అయింది. వారిని పట్టుకోడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.