చేతులు క‌లిసిన శుభ‌వేళ‌: గుంటూరు తూర్పు ఎగ్జాంపుల్ ..!

ఇలాంటి వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే న‌జీర్ అహ్మ‌ద్‌ ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి. గత ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే.. అందరిని కలుపుకొని పోతున్నారు.;

Update: 2025-07-07 13:30 GMT

కూటమిలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని నడిపించాలని సీఎం చంద్రబాబు అదేవిధంగా జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే దీనిని పాటిస్తున్న వారు ఎందరు అంటే చాలా చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. ఇలాంటి వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే న‌జీర్ అహ్మ‌ద్‌ ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి. గత ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే.. అందరిని కలుపుకొని పోతున్నారు. వివాదాలకు దూరంగా ముఖ్యంగా కూటమిలో నాయకులను కలుపుకొని పోవడంలో తనదైన శైలిని ఆయన పాటిస్తున్నారనే చెప్పాలి.

నేరుగా ఆయన జనసేన కార్యాలయాలకు కూడా వెళ్తున్నారు.. ఇది చాలా చిత్రమైన విషయం. సాధారణంగా టిడిపి తరఫున గెలిచినవారు జనసేన కార్యాలయాలకు వెళ్లడం అనేది ఎక్కడా లేదు. కానీ అవసరమైన సందర్భంలో జనసేన కార్యాలయానికి కూడా వెళుతూ వారిని కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇక తూర్పు నియోజకవర్గంలో బిజెపి పెద్ద‌గా లేకపోయినా ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులను కూడా ఆయన పరిచయం పెంచుకొని వారితో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామమ‌నే చెప్పాలి.

ఆదివారం ఈ నియోజకవర్గంలో నిర్వహించిన `సుపరిపాలనలో తొలి అడుగు` కార్యక్రమంలో జనసేన నాయకులు వచ్చేవరకు కూడా ఎమ్మెల్యే ఎదురు చూశారు. వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు అయినప్పటికీ వారిని కూడా కలుపుకొని ప్రజల మధ్యకు వెళ్లారు. గడపగడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో జనసేన నాయకులు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటి సమస్యలు పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ తరహా రాజకీయాలు నిజంగా ఆదర్శప్రాయం అని చెప్పాలి.

గుంటూరు తూర్పులో గతంలో వైసిపి వరుస విజయాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఏ చిన్న అవకాశం వచ్చినా వైసిపి పుంజుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే న‌జీర్‌ అలాంటి అవకాశం ఇవ్వకుండా కూటమి నాయకులను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఏ చిన్న విభేదాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా తానే జోక్యం చేసుకొని వాటిని సరిదిద్దె ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధిష్టానం దృష్టికి వెళ్లేలాగా వివాదాన్ని మీడియా వరకు తీసుకువచ్చేలాగా చేయడం లేదు.

గత మే నెలలో నియోజకవర్గంలో తాగునీటికి సమస్యలు వచ్చాయి. ఈ సమయంలో ఈ విషయం వివాదం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే రోజుకు 10 నుంచి 20 ట్యాంకర్ల వరకు నీటిని తరలించే విధంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. అలాగే స్థానికంగా ముస్లింలకు చెరువుగా ఉంటూ రంజాన్ సహా ఇతర పండుగలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మైనారిటీ ముస్లింల సంక్షేమం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడు న్నటువంటి సమస్యలను మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

అంటే అటు కూటమిలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని ముందుకు సాగడంతో పాటు ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్న తీరు నిజంగా అద్భుతమ‌నే చెప్పాలి. ఇదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా కలివిడిగా నాయకులు ముందుకు సాగితే చంద్రబాబు ఆశిస్తున్న విధంగా రాష్ట్రం మరో 15 ఏళ్లపాటు కూటమి అధికారంలోనే ఉంటుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

Tags:    

Similar News