నాకు ఆరుగురు పిల్లలు..నువ్వూ కను..మహారాష్ట్రలో ఒవైసీ-నవనీత్ ఢీ!
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల వేళ మాజీ ఎంపీ నవనీత్ కౌర్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నెలకొంది.;
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల వేళ మాజీ ఎంపీ నవనీత్ కౌర్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో ఠాక్రేలు, పవార్ లు కలుస్తున్నారు. మరోవైపు బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి భారీఎత్తున మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. ఇలాంటి సందర్భంలో ఒకప్పుడు తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్ నటించిన, గత లోక్ సభ లో సభ్యురాలైన నవనీత్ కౌర్, ఎంపీ అసదుద్దీన్ మధ్య అనూహ్యంగా మాటల సంవాదం నడిచింది. అది కూడా హిందూ-ముస్లిం అంశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది. మహారాష్ట్రలో ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. అక్కడి ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర కూడా కీలకంగా ఉంటోంది. గతంలో మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న చరిత్ర మజ్లిస్ పార్టీది. 2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లను, 2024లో ఒక శాసన సభ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2019లో ఔరంగాబాద్ ఎంపీ సీటులోనూ విజయం సాధించింది. అయితే, 2024లో ఈ స్థానాన్ని త్రుటిలో కోల్పోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతోంది. 80 పైగా వార్డుల్లో నెగ్గింది. వాశిం జిల్లాలోని కరంజా మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంఐఎం అధినేత అసద్ తో పాటు హైదరాబాద్ కు చెందిన పలువురు పార్టీ నేతలు మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ నెల 15న థానే సహా పలు కీలక నగరాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నువ్వూ కను.. ఎవరొద్దన్నారు..
స్థానిక ఎన్నికల సంగ్రామం నడుమ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో ఉన్న నవనీత్ కౌర్.. జనాభా/పిల్లలను కనడంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భారత్ లో ముస్లింల జనాభా పెరిగిపోతోందని.. వారు 19 మంది పిల్లలను కంటున్నారని.. హిందువుల జనాభా తగ్గిపోతోందని కాబట్టి హిందువులు కూడా నలుగురిని కనాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ ను పాకిస్థాన్ గా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
హిందూస్థాన్ అనేది హిందూ సోదర, సోదరీమణుల దేశం అని పేర్కొన్నారు. దీంతో అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని.. మీరు కూడా నలుగురు లేదా ఎనిమిది మంది పిల్లలను కనండి.. ఎవరు అడ్డుకుంటున్నారు? ఎంతమందినైతే అంతమందిని కనండి అంటూ కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి దేశంలో ముస్లింల జనాభా తగ్గుతోందని.. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసద్ పేర్కొన్నారు.
ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయలేరు..
నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై మరింత స్పందిస్తూ... ఒవైసీ మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ నిబంధనలను ప్రస్తావించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా, నవనీత్-అసద్ మధ్య ఇప్పుడే కాదు.. 2024 ఎన్నికల సమయంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. పోలీసులను 15 సెకన్లు పక్కకు తప్పిస్తే మీ అడ్రస్ లేకుండా చేస్తాం అంటూ నవనీత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంట సమయం తీసుకో.. మేమెవరికీ భయపడం అంటూ ఒవైసీ గట్టిగా సమాధానం ఇచ్చారు. కాగా, ఇప్పటి వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్దీన్ ను పాకిస్థాన్ కు పంపించి వేయాలని నవనీత్ డిమాండ్ చేశారు.
నవనీత్ కౌర్ నుంచి నవనీత్ రాణాగా...
నవనీత్ కౌర్ ది పంజాబీ నేపథ్యం. ఈమె తండ్రి ఆర్మీ అధికారి. ముంబైలో జన్మించిన నవనీత్.. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2004లో వచ్చిన శీను వాసంతి లక్ష్మి తెలుగు చిత్రంలో పేరు తెచ్చుకున్నారు. మరికొన్ని భాషల చిత్రాల్లోనూ నటించారు. 2011లో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లాడారు. దీంతో నవనీత్ రాణా అయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా అమరావతి (మహారాష్ట్ర) నుంచి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.