జూబ్లీపోరు హోరాహోరీ.. చెప్పేసిన మొదటి రౌండ్
జూబ్లీహిల్స్ ఉపపోరు హోరాహోరీగా సాగనున్న విషయాన్ని కౌంటింగ్ ఫలితాలు చెప్పేస్తున్నాయి.;
జూబ్లీహిల్స్ ఉపపోరు హోరాహోరీగా సాగనున్న విషయాన్ని కౌంటింగ్ ఫలితాలు చెప్పేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలకు పడిన ఓట్లు దగ్గరగా ఉండటం.. మెజార్టీ చాలా స్పల్వంగా ఉండటం చూస్తే.. ఉపపోరు ఎంత టైట్ గా ఉందన్న విషయం అర్థమైంది.
పోస్టల్ బ్యాలెట్ ఫలితానికి తగ్గట్లే.. తొలి రౌండ్ ఫలితం సైతం అదే రీతిలో ఉండటం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ మొత్తం 101 ఓట్లు కాగా.. అందులో కాంగ్రెస్కు 47 ఓట్లు పోల్ అయితే.. బీఆర్ఎస్ కు 43 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 11 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే.. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ సాధించిన మెజార్టీ కేవలం నాలుగు ఓట్లు మాత్రమే. ఇక.. తొలి రౌండ్ ఫలితాన్ని చూస్తే.. జూబ్లీ ఉపపోరు ఎంత హోరాహోరీగా సాగిందన్న విషయం అర్థమయ్యేలా చేసింది.
తొలి రౌండ్ ఫలితాన్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 8926 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ కు 8864 ఓట్లు పోలయ్యాయి. అంటే.. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల వ్యత్యాసంతో ముందంజలో ఉంది. పోటాపోటీగా జరిగిన ఉపపోరు హోరాహోరీగా సాగుతుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నదే. దీనికి తోడు తక్కువ పోలింగ్ సైతం ఇరు పార్టీ నేతలకు.. అభ్యర్థులకు టెన్షన్ గా మారింది. ఈ వాదనకు తగ్గట్లే పోస్టల్ బ్యాలెట్ ఫలితం.. మొదటి రౌండ్ ఫలితం చూసినప్పుడు.. జూబ్లీ ఉపపోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మొత్తం పది రౌండ్లలో వెలువనున్న ఈ ఫలితం ఉదయం 11.30 నుంచి 12 గంటల్లోపే వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది.