కుల సర్వేకు నారాయణమూర్తి దంపతులు నో... ఏమి చెప్పారంటే..!

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి.. కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహిస్తున్న సామాజిక ఆర్ధిక సర్వేలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు.;

Update: 2025-10-16 12:30 GMT

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సామాజిక ఆర్ధిక సర్వేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో.. రాష్ట్ర వ్యాప్తగా ప్రతీ ఇంటికీ వెళ్లి సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. సెప్టెంబరు 22 నుంచి రాష్ట్రంలో ఈ సర్వే జరుగుతోండగా... దీని కింద రాష్ట్ర జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, కుల వివరాలను సేకరించనున్నారు. ఈ సమయంలో నారాయణమూర్తి ఇంటికి ఇవెళ్లిన సిబ్బందికి ఊహించని పరిణామం ఎదురైందని తెలుస్తోంది!

అవును... కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సామాజిక, ఆర్థిక సర్వేలో భాగంగా సిబ్బంది.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇంటికి వెళ్లగా, వారికి ఊహించని పరిణామం ఎదురైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... తాము వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని వారు అధికారులతో తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి.. కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహిస్తున్న సామాజిక ఆర్ధిక సర్వేలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సర్వే సిబ్బంది వారి నివాసాన్ని సందర్శించినప్పుడు.. ఆ జంట వారితో.. “మా ఇంట్లో సర్వే నిర్వహించకూడదని మేము కోరుకుంటున్నాము” అని చెప్పినట్లు తెలిసింది.

ఇదే విషయాన్ని వారు సర్వే పత్రంపై రాసి సంతకాలు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా... తమ ఇంట్లో ఈ సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదని పేర్కొంటూ నారాయణమూర్తి దంపతులు స్వీయ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మొహదాస్ పాయ్ కూడా ఈ కుల సర్వేను తప్పుబట్టారు!

స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం!:

ఈ పరిణామాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా... ఇది పూర్తిగా స్వచ్ఛందంగా చేపడుతున్న సర్వే అని, ఇందులో పాల్గొనాలని తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. దీని కింద రాష్ట్ర జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, కుల వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు! దీనికోసం ప్రభుత్వం రూ.420 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

సర్వేపై వ్యతిరేకతలు.. సమర్ధించిన కోర్టు!:

మరోవైపు ఈ సర్వేపై రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యతిరేకతలు వచ్చాయి. ఈ సందర్భంగా హైకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే... సామాజిక, ఆర్థిక సర్వేను అడ్డుకోలేమని.. దీనివల్ల పౌరుల హక్కులను ఉల్లంఘించడం జరగదని.. అయితే, బలవంతంగా వ్యక్తిగత వివరాలు సేకరించరాదని.. చెప్పిన ఉన్నత న్యాయస్థనం ఆ పిటిషన్లను తోసిపుచ్చింది.

కాగా... 2025 అక్టోబర్ ప్రారంభం నాటికి కర్ణాటకలోని సుమారు 83% గృహాలు సర్వే చేయబడ్డాయని.. రాష్ట్రంలోని మొత్తం 1.43 కోట్ల కుటుంబాలలో దాదాపు 1.22 కోట్ల గృహాలను లెక్కించారని అంటున్నారు. మరోవైపు బెంగళూరులో అక్టోబర్ 24లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది!

Tags:    

Similar News