అమరావతి ఎందాకా వచ్చింది? నారా లోకేష్ కు ఉపరాష్ట్రపతి ప్రశ్న
దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లో టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు.;
దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లో టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్.. మర్యాద పూర్వకంగానే ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని కోరినట్టు తెలిసింది.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అందునా అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ'ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా నారా లోకేష్ ఉపరాష్ట్రపతికి వివరించారు. దీనికి ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసలు గుప్పించారు. అదే సమయంలో రాజధాని పనులు ఎందాకా వచ్చాయని ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారని తెలిసింది.
రూ.64 వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తిచేస్తున్నామని లోకేష్ చెప్పా రు. ఈ నెల 21వతేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ఉపరాష్ట్రపతి తన పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన `యువగళం` పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఎపి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. ఈ చర్చల్లో జగన్ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలిసింది. జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. అయితే.. పొదిలి ఘటనతోపాటు అమరావతి మహిళలపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా నారాలోకేష్ వివరించినట్టు తెలిసింది.