కేంద్ర మంత్రి లోకేశ్.. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో తెలుసా?

టీడీపీ యువనేత నారా లోకేశ్ కేంద్ర మంత్రి కానున్నారా? అందుకే ఆయన ఇటీవల ప్రధాని మోదీని కలిశారా? మీరు చదువుతున్నది నిజమా? అబద్దామా? అని అనుకుంటున్నారా? జనసేన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇప్పుడిదే ప్రధానంగా సర్క్యులేట్ అవుతోంది.;

Update: 2025-05-28 10:30 GMT

టీడీపీ యువనేత నారా లోకేశ్ కేంద్ర మంత్రి కానున్నారా? అందుకే ఆయన ఇటీవల ప్రధాని మోదీని కలిశారా? మీరు చదువుతున్నది నిజమా? అబద్దామా? అని అనుకుంటున్నారా? జనసేన అభిమానుల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇప్పుడిదే ప్రధానంగా సర్క్యులేట్ అవుతోంది. తమ అధినేత పవన్ కు లోకేశ్ పోటీ అనుకుంటున్నారో? లేక తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ప్రకటించిన మంత్రి పదవి దక్కనందుకు నిరసన తెలుపుతున్నారో? కానీ ఈ విషయాలను ప్రస్తావిస్తూ లోకేశ్ కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారంటూ జనసేన సోషల్ మీడియా సైనికులు తెగ ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీల అగ్రనాయకత్వం ఎంతో సంయమనం పాటిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం పుట్టికొస్తుందంటున్నారు. రాజకీయంగా ఆసక్తి రేపుతున్న ఈ ప్రచారం వెనుక ఎవరునున్నారనేది తేలాల్సివుంది.

కడప వేదిక టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలోనే యువనేత లోకేశ్ ను భావినేతగా ప్రకటిస్తారని కొద్దిరోజులుగా వినిపిస్తుంది. టీడీపీ పూర్తిస్థాయి బాధ్యతలు లోకేశ్ కు అప్పగించాలని ఆ పార్టీలో దిగువస్థాయి నుంచి అగ్రనేత వరకు అంతా ఒకే మాట మీద ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి మహానాడులో టీడీపీ చేయబోయే ప్రకటనపైనే ఉంది. కానీ, అనూహ్యంగా జనసేన సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు భిన్నమైన ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీతానై ప్రభుత్వాన్ని లోకేశ్ నడుపుతున్నారని విపక్షం విమర్శిస్తుండగా, మిత్రపక్షం జనసేన మాత్రం లోకేశ్ కేంద్ర మంత్రి కాబోతున్నారని ప్రచారం చేస్తోంది. దీంతో జనసైనికులకు ఏమైందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీడీపీ-జనసేన పార్టీలు కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోస్తున్నాయి. ప్రధానంగా జనసేనాని పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పవన్ ను లోకేశ్ ఓవర్ టేక్ చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ముందుగా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఇటీవల కొన్ని ప్రచార మాధ్యమాల్లో పేరుకే చంద్రబాబు సీఎం అయినా, మొత్తం ప్రభుత్వాన్ని లోకేశ్ మాత్రమే నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీని వెనుక విపక్ష వైసీపీ పాత్ర ఉందని అనుమానిస్తున్నా, జనసేన వర్గాలు కూడా లోకేశ్ ప్రభావం పెరిగిపోతోందని భయపడుతున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వంలో లోకేశ్ ప్రభావం, పాత్ర పెరిగితే తమ అధినేతకు మంచిది కాదని భావిస్తున్న జనసేన వర్గాలు లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నాయని అంటున్నారు. అందుకే రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేశ్ కేంద్ర మంత్రి కాబోతున్నారని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల కుటుంబ సమేతంగా లోకేశ్ ప్రధాని మోదీని కలవడాన్ని కూడా జనసేన తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుందని అంటున్నారు ఏ కారణం లేకుండా లోకేశ్ ప్రధానిని ఎందుకు కలిశారని? ప్రశ్నిస్తున్న జనసైనికులు లోకేశ్ కేంద్ర ప్రభుత్వంలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో త్వరలో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ఈ సందర్భంగా తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రిని చేసి లోకేశ్ తోపాటు మరికొందరు రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పిస్తారని జనసేన ప్రచారం చేయడం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని కూడా జనసైనికులు తట్టుకోలేకపోతున్నారని అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు.

అయితే మహానాడు జరుగుతున్న వేళ జనసైనికులు చేస్తున్న ఈ ప్రచారం ఎంతవరకు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ భావినేతగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ లోకేశ్ ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో అందుకు పూర్తి విరుద్ధమైన ప్రచారాన్ని జనసైనికులు చేపట్టడంపై టీడీపీ సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా మొత్తం మహానాడుపైనే ఫోకస్ పెట్టింది. ఈ పెద్ద వేడుక ముగిసిన వెంటనే జనసేనపై కౌంటర్ అటాక్ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News