పునర్విక కన్నీళ్లు.. లోకేశ్ ఆశయం : అరుదైన వ్యాధులపై యుద్ధమే..
రాష్ట్రంలో అరుదైన వ్యాధుల గుర్తింపు, నివారణ వంటివాటిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే దిశగా మంత్రి ఆధ్వర్యంలో బుధవారం చర్చించారు.
రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నవారికి ఊరటనిచ్చేలా, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేలా మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన వ్యాధులపై సమగ్రమైన విధానాన్ని (Rare Diseases Policy) రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో ప్రకటించారు. ఇందులో భాగంగా, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైద్య నిపుణులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, విధాన రూపకర్తలతో కీలక సంప్రదింపుల జరిపినట్లు మంత్రి ఆ ట్వీట్ లో వెల్లడించారు.
పునర్విక పోరాటమే స్ఫూర్తి
అరుదైన వ్యాధితో బాధపడుతూ, మంత్రి లోకేశ్, సోషల్ మీడియా ఫండింగ్ తో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి పునర్విక ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో ఏ చిన్నారి ఇలాంటి సమస్యలను ఎదుర్కోకుండా చూడాలనే లక్ష్యంతో పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. అరుదైన వ్యాధుల నిర్ధారణ తర్వాత కుటుంబాలు ఎదుర్కొనే అనిశ్చితి, కాలంతో చేసే పోరాటం, తలకు మించిన ఆర్థిక భారాన్ని పునర్విక విషయంలో దగ్గరుండి చూసిన లోకేశ్ చలించిపోయారు. దీంతో ఇలాంటి కేసులకు ఒక వ్యవస్థీకృతమైన సహాయ వ్యవస్థను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నానని మంత్రి తెలిపారు.
సమగ్ర విధాన రూపకల్పన
రాష్ట్రంలో అరుదైన వ్యాధుల గుర్తింపు, నివారణ వంటివాటిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే దిశగా మంత్రి ఆధ్వర్యంలో బుధవారం చర్చించారు. ముందస్తు వ్యాధి నిర్ధారణ ప్రక్రియను పటిష్టం చేయడం, రోగుల వివరాలను క్రోడీకరించేందుకు ప్రత్యేకమైన రిజస్టర్ల ఏర్పాటు, అత్యాధునిక చికిత్సా సదుపాయాలతో కూడిన అత్యుత్తమ కేంద్రాల స్థాపన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. దీని ద్వారా వ్యాధిని పసిగట్టడం నుండి, చికిత్స అందుబాటులోకి తీసుకురావడం, బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతు అందించడం వరకు ఒక పూర్తిస్థాయి చట్రాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని చెబుతున్నారు.
ప్రతి బిడ్డకు భరోసా..
"అరుదైన వ్యాధి కారణంగా ఏ బిడ్డ కూడా ఆశను కోల్పోకూడదు" అని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కేవలం ప్రభుత్వ పథకాలకు పరిమితం కాకుండా, ఒక కరుణామయమైన సమ్మిళితమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు త్వరలోనే సమగ్ర విధానంగా రూపుదాల్చనున్నాయి. ఇది అమల్లోకి వస్తే, రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అనేక కుటుంబాలకు ఇది ఒక పెద్ద వరం కానుందని చెబుతున్నారు.
ఒక సామాజిక బాధ్యతను గుర్తించి, వ్యవస్థాగత మార్పు కోసం మంత్రి లోకేశ్ తీసుకున్న ఈ చొరవ సర్వత్రా అభినందనలు అందుకుంటోంది. రాజకీయ నాయకత్వం మానవీయ కోణంలో స్పందిస్తే, వ్యవస్థలో ఎంతటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ 'అరుదైన వ్యాధుల విధానం' ఒక నిదర్శనంగా నిలవనుందని వ్యాఖ్యానిస్తున్నారు. పునర్విక వంటి చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం, రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా మారాలని ఆకాంక్షిస్తున్నారు.