అటు పవన్-ఇటు లోకేష్.. మెసేజ్ సేమ్ టు సేమ్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఒకే రోజు పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఒకే రోజు పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగానే నిర్వహించిన కార్యక్రమాల్లో.. పార్టీ కార్యకర్తలతో వారు మాట్లాడారు. అయితే.. సందేశం మాత్రం ఒక్కటే ఇచ్చారు. అదే.. అందరూ కలివిడిగా ఉండాలని.. మరో 15 ఏళ్లు కూటమి కలిసి ముందుకు సాగాలని!.
వాస్తవానికి వచ్చే ఎన్నికలకు సమయం మూడేళ్లు ఉంది. అయినప్పటికీ.. ఇప్పటి నుంచి కార్యకర్తలను ఏకం చేయడం ద్వారా 15 ఏళ్ల ప్రయోజనాన్ని గుర్తు చేయడం ద్వారా.. కూటమి ఐక్యతకు ఇప్పటి నుంచే పాదు తీస్తున్నారు.. నీళ్లు పోస్తున్నారు. నిజానికి నలుగురు ఉన్న ఒక కుటుంబంలోనే అనేక వివాదాలు.. విమర్శలు.. తగువులు ఉంటున్నాయి. అలాంటిది భిన్నమైన సిద్ధాంతాలు.. భిన్నమైన అజెండాలతో ఉన్న పార్టీలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి.
వీటిని వదిలేసి.. ఎవరూ ముందుకు సాగకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని అటు నారా లోకేష్, ఇటు పవన్ కూడా ప్రస్తావించారు. తగువులు లేవని, వివాదాలు రావని వారు చెప్పలేదు. కానీ, వచ్చిన వివాదాల ను సర్దు బాటు చేసుకునేందుకు.. సమస్యలు పరిష్కరించుకునేందుకునాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఇది ఒకరకంగా.. 15 ఏళ్ల స్ట్రాటజీకి ప్రాణం పోస్తున్న అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా 15 ఏళ్లపాటు కలిసి ఉంటే జరిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు.
సో.. మొత్తానికి ఓవర్ హెడ్ ట్యాంకుగా ఉన్న రెండు పార్టీల కీలక నాయకులు ఒక నిర్ణయంతో ముందుకు సాగుతున్నారన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు కావాల్సింది.. నాయకుల్లో ఐక్యత. రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నప్పుడు.. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే.. వారికే వ్యక్తిగతంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది తప్ప.. మరొకటి కాదు. సో.. మొత్తంగా అటు లోకేష్ అయినా.. ఇటు పవన్ అయినా.. ఇస్తున్న సందేశం ఒక్కటే. దీనిని అర్ధం చేసుకోవాల్సిన అవసరం నాయకులపైనే ఉంది.