డీజే అవసరమా లోకేశ్.. మంత్రి ప్రకటనపై తీవ్ర విమర్శలు!

వినాయక నిమజ్జనాల్లో డీజే వాడితే ఎలాంటి అభ్యంతరం లేదని, పోలీసులు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేయడానికి వీలులేదని మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-09-19 09:08 GMT

వినాయక నిమజ్జనాల్లో డీజే వాడితే ఎలాంటి అభ్యంతరం లేదని, పోలీసులు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేయడానికి వీలులేదని మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి లోకేశ్ సూచనలు పాటిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించడంపైనా అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. రాజకీయంగా యువతను ఆకట్టుకోవడానికే ఈ రకమైన ప్రకటనలు చేయడాన్ని బాధ్యతారాహిత్యంగా భావించాలని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో మంత్రులు లోకేశ్, అనిత గతంలో ప్రభుత్వం చేసిన చట్టాలు తెలుసుకోవాలని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు. భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన వినాయక నిమజ్జనోత్సవాల్లో డీజే శబ్దాలకు పలువురు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా డీజే శబ్దాలు తట్టుకోలేక రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు మరణించారని గుర్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా సోమందేవపల్లిలో తాజాగా ఒకరు డీజే శబ్దాలతో గుండెపోటుకు గురై మరణించారు. ఏటా ఇలాంటి ఘటనలు నమోదు అవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఓట్ల రాజకీయం కోసం ధ్వని కాలుష్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలే డీజేలను ప్రోత్సహించేలా నడుచుకోవడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

డీజే అంటే డిస్క్ జాకీ అని అర్థం. సాధారణ శబ్దాలకు మించి అత్యధిక డెసిబెట్స్ తో భారీ ధ్వని తరంగాలు విడుదల చేయడం వీటి ప్రత్యేకత. వినాయక నిమజ్జనాలు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే డీజే సౌండ్స్ వల్ల అనేక అనర్థాలు జరుగుతుండటంతో డీజేల వినియోగంపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. నిజానికి మనుషులు 60 నుంచి 70 డెసిబెల్స్ శబ్దాలను మాత్రమే గ్రహించగలరని అంటున్నారు. అయితే డీజే సౌండ్స్ మాత్రం 120 నుంచి 150 డెసిబెల్స్ వరకు ఉంటున్నాయి. దీంతో బలహీనమైన గుండె ఉన్నవారితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు ప్రాణాపాయానికి గురవుతున్నారు. కొందరికి వినికిడి సమస్య తలెత్తుతోంది. భారీ శబ్దాలను వినడం వల్ల చెవిలో ఇంటర్నల్ హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడికి గురవుతున్నారని చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో డీజేని వినియోగించడం నిషేధం. ఒకవేళ పోలీసు అధికారుల అనుమతితో వినియోగించినా పగటిపూట 55 డెసిబెల్స్ సౌండ్ మించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాత్రిపూట అయితే 45 డెసిబెల్స్ కన్నా తక్కువ సౌండునే ఉంచాలి. ఇక రాత్రి పది తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్లు వాడకూడదని ప్రభుత్వం నిషేధాజ్ఙలు విధించింది. అయితే ప్రభుత్వ నిబంధనలు ఇలా ఉండగా, మంత్రి లోకేశ్ డీజే బాక్సులు వాడుకోవచ్చని బహిరంగంగా ప్రకటన చేయడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెబుతున్నారు.

సంప్రదాయం ఏం చెబుతోంది?

మంత్రి నారా లోకేశ్ ప్రకటన సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉందని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం ప్రకారం వినాయక చవితి ఉత్సవాలకు, నిమజ్జనానికి స్పష్టమైన ఆధ్యాత్మిక నియమాలు ఉన్నాయి. వినాయక పూజ ఎప్పుడూ ప్రశాంతమైన, సాత్విక వాతావరణంలో జరగాలి. వేద మంత్రాలు, భజనలు, కీర్తనలు, డప్పులు, తాళాలు, మృదంగాలు వంటి సాంప్రదాయ వాయిద్యాలతో స్వామివారిని కీర్తించడం ఆచారం. ఇవి మనసుకు ప్రశాంతతను, సానుకూల శక్తిని ఇస్తాయని చెబుతున్నారు. కానీ, డీజే సంస్కృతికి తావు లేదని పండితులు చెబుతున్నారు. శాస్త్రాలలో ఎక్కడా విపరీతమైన శబ్ధాలు చేసే డీజేలు, కర్ణకఠోరమైన పాటలకు అసభ్యంగా నృత్యం చేయడం వంటివి చెప్పబడలేదని గుర్తు చేస్తున్నారు. పూర్తిగా ఆధునిక కాలంలో, వ్యక్తిగత ఆనందం, ఆర్భాటం కోసం వచ్చి చేరిన పోకడగా అభివర్ణిస్తున్నారు. నిమజ్జనం అంటే కేవలం ఊరేగింపు కాదని, భక్తిభావంతో పూజించిన విగ్రహాన్ని నీటిలో లీనం చేయడం ద్వారా 'ప్రకృతిలో కలిసిపోవడమనే' తాత్త్వికతను చాటిచెప్పడమే అంటున్నారు. కానీ, ప్రస్తుతం ఊరేగింపులలో హడావుడి చేయడమే ఎక్కువగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News