ఐఫోన్ 18 క్రేజ్ : బంగారం అమ్మి ఒకరు.. కాబోయే భార్యకు గిఫ్ట్ ఇవ్వాలని మరొకరు.. ఎగబడిపోతున్నారు..

ఇక మరో యువకుడి కథ కూడా ఆసక్తికరంగా మారింది. తనకు కాబోయే భార్యకు ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్న అతడు.. ఇందుకోసం ఏకంగా పంజాబ్ నుంచి నోయిడాకు వచ్చినట్లు తెలిపాడు.

Update: 2026-09-19 07:50 GMT

యాపిల్ ఐఫోన్ అంటేనే ఓ ప్రత్యేకమైన క్రేజ్. కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. దాని ధర ఎంత ఉన్నా కొనుగోలు చేసేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. తాజాగా విడుదలైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు పెరిగినప్పటికీ యాపిల్ అభిమానుల్లో మాత్రం ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. కొందరైతే తమకు ఎంతో ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏకంగా బంగారం అమ్మి మరీ ఐఫోన్ కొనుగోలు చేస్తున్నారు.

ధర పెరిగినా.. డిమాండ్‌లో తగ్గేదే లే

ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే కొత్త ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లకు భారత్‌లో డిమాండ్ 15-28 శాతం పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త బర్గండీ కలర్ యూజర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ స్టోరేజీ ఆప్షన్లు, కొత్త ఫీచర్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,64,900 నుంచి, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,74,900 నుంచి ప్రారంభమైనప్పటికీ ప్రీ-బుకింగ్, కొనుగోలు కోసం అభిమానులు స్టోర్ల వద్దకు క్యూ కడుతున్నారు.

భార్యకు గిఫ్ట్ కోసం.. బంగారం అమ్మేశాడు

ఐఫోన్‌పై ఉన్న క్రేజ్‌కు నోయిడాలో చోటుచేసుకున్న ఓ ఘటన నిదర్శనంగా మారింది. కొత్త ఐఫోన్‌ను తన భార్యకు బహుమతిగా ఇవ్వాలని భావించిన ఓ వ్యక్తి.. చేతిలో డబ్బులు లేకపోవడంతో బంగారు నగలు విక్రయించి మరీ ఫోన్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. “నా భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. డబ్బులు లేకపోవడంతో బంగారం అమ్మేసి క్యూలో నిలబడ్డాను” అని అతడు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఆకర్షించింది.

కాబోయే భార్య కోసం పంజాబ్ నుంచి నోయిడాకు..

ఇక మరో యువకుడి కథ కూడా ఆసక్తికరంగా మారింది. తనకు కాబోయే భార్యకు ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్న అతడు.. ఇందుకోసం ఏకంగా పంజాబ్ నుంచి నోయిడాకు వచ్చినట్లు తెలిపాడు. కొత్త ఐఫోన్ కోసం ఇంత దూరం ప్రయాణించడమే యాపిల్ ఫోన్లపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. మరో జంట ఇప్పటికే ఐఫోన్ 18 కొనుగోలు చేసినట్లు చెప్పింది. అంతటితో ఆగకుండా త్వరలో ఐఫోన్ డూయో కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఫోన్ కంటే.. ఫీలింగ్ ముఖ్యం!

ఐఫోన్ 18 సిరీస్ చుట్టూ కనిపిస్తున్న ఈ ఆసక్తి కేవలం కొత్త ఫోన్‌పై ఉన్న మోజుకే పరిమితం కాలేదు. కొందరికి అది తమ జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రత్యేకమైన బహుమతి. మరికొందరికి తమ టెక్నాలజీపై ఉన్న అభిరుచికి ప్రతీక.

ధరలు పెరిగినా కొనుగోలుదారుల ఉత్సాహం తగ్గకపోవడం.. కొత్త కలర్ కోసం ఆసక్తి చూపడం.. దూర ప్రాంతాల నుంచి స్టోర్లకు రావడం వంటి ఘటనలు ఐఫోన్ 18 సిరీస్‌పై ఉన్న మార్కెట్ హైప్‌ను చూపిస్తున్నాయి. అయితే ఫోన్ కోసం బంగారం అమ్ముకోవడం వంటి నిర్ణయాలు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టి జాగ్రత్తగా తీసుకోవాల్సినవేనన్నది మాత్రం గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News