లోకేశ్ అమెరికా టూరుపై ఉత్కంఠ.. ఈ సారి ఏం సర్ ప్రైజ్ ఉంటుందో?

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ వచ్చేనెల 6న అమెరికాలో పర్యటించనున్నారు. డల్లాస్ కౌంటీ గార్లాండ్‌లో జరిగే భారీ సభలో లోకేష్ ప్రసంగిస్తారు.;

Update: 2025-11-26 09:48 GMT

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ వచ్చేనెల 6న అమెరికాలో పర్యటించనున్నారు. డల్లాస్ కౌంటీ గార్లాండ్‌లో జరిగే భారీ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐలకు ధన్యవాదాలు తెలియజేసేందుకు లోకేశ్ ఈ పర్యటనను చేపట్టారు. పనిలో పనిగా 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని చర్చించనున్నారు. దీంతో ఈ సారి లోకేశ్ అమెరికా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఒకసారి అమెరికా వెళ్లిన లోకేశ్ సైలెంటుగా గూగుల్ యాజమాన్యంతో చర్చలు జరిపి.. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేనెలలో అమెరికాలో అడుగు పెడుతున్న లోకేశ్ ఇంకేమైనా పెద్ద ప్లాన్ చేస్తున్నారా? అనేది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

గార్లాండ్ లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో లోకేశ్ పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 8 వేల మంది తెలుగు ప్రవాసీలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. అమెరికా, కెనడాల్లో ఉంటున్న తెలుగు వారంతా పాల్గొనేలా ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. గార్లాండ్‌లోని కర్టిస్‌ కల్వెల్‌ సెంటర్‌లో ఈ భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పెట్టుబడుల వేట మొదలుపెట్టనున్నారు లోకేశ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల వర్తకం సుమారు రూ.17.92 లక్షల కోట్లు ఉండగా.. దిగుమతులు రూ.11.65 లక్ష కోట్లకు చేరాయని, దీనిని మరింత విస్తరించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు తన అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేశ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ తెలిపారు.

ఏపీని ప్రపంచ పెట్టుబడులకు వేదికగా చేయాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిచయాలను ఉపయోగించుకుని పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహిస్తుండగా, మంత్రి లోకేశ్ సైతం పెట్టుబడుల వేటను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఏపీకి పెట్టుబడుల కోసం లోకేష్ కాలికి బలపం కట్టుకుని విదేశాలకు తిరుగుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా తన మాటలే కాకుండా చేతలతో ప్రతిపక్షాలకు సమాధానం చెబుతున్నారు. గతంలో దావోస్ పర్యటనతోపాటు లోకేష్ లండన్ పర్యటనను ఉద్దేశించి విపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఏకంగా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు రప్పించి అందరికీ సమాధానం చెప్పారు లోకేష్. అందుకే ఇప్పుడు లోకేష్ విదేశీ పర్యటన అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమైన వణుకు కనిపిస్తోందని అంటున్నారు.

గతంలో దావోస్ ఆర్థిక సదస్సు.. తాజాగా విశాఖలో సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడంలో మంత్రి లోకేశ్ పాత్ర కీలకంగా చెబుతున్నారు. ప్రధానంగా విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించేలా లోకేశ్ చర్యలు తీసుకున్నారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంతోపాటు డేటాసిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకునేలా లోకేశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముందు చూపుతో ఎవరూ ఊహించని సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఒక్క జూము మీటింగుతో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చిన లోకేశ్.. రిలయన్స్ సీఎన్జీ గ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ ఒప్పందాలుగా కాగితాలకే పరిమితం కాలేదు. రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. టీసీఎస్, కాగ్నిజెంట్ తమ కార్యాలయాల ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి పెట్టుబడుల వేటకు బయలుదేరిన లోకేశ్.. ఈ సారి ఏయే సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News