అంత్యక్రియలు వివాహంగా మారిన ఘటన.. తెరపైకి సంచలన ఆరోపణలు!

ఈ క్రమంలో.. ఈ కేసులోని ప్రేమికురాలు తాజాగా తన సోదరులు, పోలీసులపై చేసిన అరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి!;

Update: 2025-12-01 13:19 GMT

మహారాష్ట్రలోని నాందేడ్ లో పరువు హత్య వ్యవహారం, దాని తదనంతర ఘటనలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ కేసులోని ప్రేమికురాలు తాజాగా తన సోదరులు, పోలీసులపై చేసిన అరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి! ఇదే సమయంలో తన ప్రేమికుడిది పూర్తిగా కులం పేరుతో జరిగిన హత్యగా ఆమె తెలిపారు! తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కులాంతర సంబంధం కారణంగా సాక్షం టేట్ (20)ని ఆంచల్ మామిద్వార్ (21) అనే యువతి కుటుంబ సభ్యులు కొట్టి చంపారనేది ఆరోపణ! ఈ ఘటన తర్వాత తాజాగా... తన సోదరులను సాక్షంపై దాడి చేయడానికి రెచ్చగొట్టిన అనేక మందిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... తన కుటుంబ సభ్యులు తొలుత తాను సాక్షంను వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని అంగీకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. తాను, సాక్షం సుమారు మూడు సంవత్సరాలుగా కలిసి ఉన్నామని.. ఈ క్రమంలో తాము ఎన్నో కలలు కన్నామని.. మా పెళ్లి చేస్తామని నా సోదరులు నాకు హామీ ఇచ్చారని.. కానీ, చివరి క్షణంలో మోసం చేశారని ఆంచల్ ఆరోపించారు.

ఇదే క్రమంలో... సాక్షంను చంపే విషయంలో ఇద్దరు పోలీసులు తన సోదరులను రెచ్చగొట్టారని ఆరోపించిన ఆంచల్... సాక్షం హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నా తమ్ముడు నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడని తెలిపింది. ఈ సందర్భంగా సాక్షంపై తప్పుడు ఫిర్యాదు చేయాలని నన్ను అడగ్గా.. అందుకు నిరాకరించినట్లు ఆంచల్ పేర్కొంది.

ఈ సమయంలో... అక్కడున్న ఇద్దరు పోలీసులు నా సోదరుడితో.. ‘వాళ్లను, వీళ్లను చంపిన తర్వాత నువ్వు ఇక్కడికి వస్తూనే ఉన్నావు కానీ.. నీ సోదరితో సంబంధం ఉన్న వ్యక్తిని ఎందుకు చంపకూడదు?’ అని అడిగారని.. ఆమె తెలిపింది! దీంతో... ‘సరే అయితే, సాయంత్రం నాటికి అతన్ని చంపి నీ దగ్గరకు వస్తాను’ అని నా సోదరుడు జవాబిచ్చాడని ఆమె వెల్లడించింది!

ఈ సందర్భంగా... ఈ హత్య కులం కారణంగా జరిగిందని.. తాము గ్యాంగ్ స్టర్లమని, ఈ విషయం సాక్షంకు తెలుసని.. ఐనప్పటికీ మా కూతురితో మాట్లాడటానికి ఎలా ధైర్యం చేయగలిగాడని తన తండ్రి, సోదరులు తనకు చెప్పేవారని ఆంచల్ తెలిపింది. మరోవైపు.. తనను సాక్షం కుటుంబం అంగీకరించిందని.. తాను ఎప్పటికీ వారితోనే ఉంటానని తెలిపింది. కులం పేరుతో మనుషులను చంపకూడదని ఆమె కోరింది!

కాగా... సాక్షం అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఆంచల్ అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన ఆంచల్... గత మూడేళ్లుగా తాను సాక్షంను ప్రేమిస్తున్నానని.. కుల విభేదాల కారణంగా మా నాన్న మా సంబంధాన్ని వ్యతిరేకించారని.. మా కుటుంబం తరచూ సాక్షంను చంపుతామని బెదిరించిందని తెలిపింది.

అన్నట్లుగానే నా తండ్రి, సోదరులు హిమేష్, సాహిల్ ఆ పని పూర్తి చేశారని.. ఈ సమయంలో నాకు న్యాయం కావాలని.. నిందితులను ఉరి తీయాలని కోరుకుంటున్నట్లు ఆంచల్ తెలిపింది. ఇకపై తాను సాక్షం కుటుంబంతోనే జీవిస్తానని ఆమె చెప్పారు.

Tags:    

Similar News