నంద‌మూరి కుటుంబం గుస్సా.. రీజ‌న్ అదేనా ..?

ఈ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి సుహాసినిని రంగంలోకి దింపాలన్న‌ది ఆ కుటుంబంలో వినిపిస్తున్న మాట.;

Update: 2025-10-16 04:26 GMT

నందమూరి కుటుంబంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీవ్ర స్థాయిలో చర్చగా మారింది. ప్రస్తుతం హైదరాబాదులోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి సుహాసినిని రంగంలోకి దింపాలన్న‌ది ఆ కుటుంబంలో వినిపిస్తున్న మాట. ఇది ప్రస్తుతం అంతర్గతంగానే ఉన్నప్పటికీ అత్యంత కీలక నాయకుల ద్వారా మీడియా వర్గాలకు సమాచారం అందింది. సుహాసిని ఈ టికెట్ను ఆశిస్తున్నారని తెలిసింది.

మెరుగైన ఓటు బ్యాంకు ఉన్న నేప‌థ్యంలో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నందున.. తనకు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ద్వారా సుహాసిని ప్రయత్నాలు చేస్తున్నారన్నది పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో ఎవరిని పోటీకి నిలబెట్ట‌రాద‌ని, ఎవరికి మద్దతు కూడా ఇవ్వద్దని ఆయన నిర్ణ‌యించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా తేల్చి చెప్పారు.

అయినప్పటికీ నందమూరి కుటుంబంలో ఈ టికెట్ పై చాలా ఆశలు కనిపిస్తున్నాయి. సుహాసిని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూకట్ ప‌ల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో నిలిచారు. అప్పట్లోనూ ఉప ఎన్నికల్లోనే ఆమె పోటీ చేశారు. అయితే ఆమె పరాజ‌యం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ టిడిపి ఆ ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో సుహాసిని ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్ రూపంలో అవకాశం వచ్చింది.

కానీ ఈ ఎన్నికలకు కూడా చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమె తీవ్రంగా అంతర్మ‌థ‌నం చెందుతున్నారన్నది సమాచారం. మరి దీనిపై ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే నారా భువనేశ్వరి ఆయనను ఒప్పిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో అదేవిధంగా ముఖ్యంగా టిడిపి నాయకుల మధ్య చర్చ నడుస్తోంది. ఒకవేళ చంద్రబాబు కనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సుహాసిని కి అక్కడ ఏమేర‌కు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది ముందుగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని కొంతమంది నాయకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News