బాలయ్య మంత్రి అవ్వాలి.. అభిమానుల కోరిక, నటసింహం స్పందన ఏంటంటే?
హిందుపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ మంత్రి పదవి చేపట్టాలంటే ఆయన అభిమానులు కొత్త డిమాండ్ తీసుకువచ్చారు.;
హిందుపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ మంత్రి పదవి చేపట్టాలంటే ఆయన అభిమానులు కొత్త డిమాండ్ తీసుకువచ్చారు. సొంత నియోజకవర్గంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న బాలయ్యకు ఈ సారి కార్యకర్తల నుంచి వింత కోరిక రావడంతో ఎలా స్పందించాలో కూడా అర్థం కాక కొంతసేపు నవ్వుతూ మౌనం దాల్చారని అక్కడి వారు చెబుతున్నారు. హిందుపురం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన బాలయ్యకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. తొలిసారిగా ఆయన మంత్రి పదవి చేపట్టాలంటూ స్థానిక కార్యకర్తలు నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ కంచుకోట హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ మంత్రి పదవిపై మక్కువ ఉన్నట్లు ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. బావ చంద్రబాబు సీఎం, అల్లుడు లోకేశ్ మంత్రిగా ఉండగా తనకు మంత్రి పదవి అవసరమేంటనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రికి కుమారుడిగా మరో ముఖ్యమంత్రికి వియ్యంకుడిగా బాలయ్యకు ప్రభుత్వంలో సూపర్ పవర్స్ ఉన్నాయనే ప్రచారం ఉంది. కానీ, ఆయన ఎప్పుడూ తన పరిధి దాటి వ్యవహరించారన్న ఒక్క విమర్శ కూడా ఎదుర్కోలేదు. తన పనేదో తాను చేసుకుపోవడం, నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలను చెక్కబెట్టడమే ఇన్నాళ్లు బాలయ్య చేస్తున్నారు.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకపోయినా క్రమం తప్పకుండా హిందుపురం వచ్చి వెళుతుంటారు బాలయ్య. స్థానికంగా ఏ ముఖ్య కార్యక్రమం ఉన్నా వెంటనే వాలిపోతుంటారు. కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంటారని చెబుతుంటారు. శాసనసభ్యుడిగా ఏ పని కావాలన్నా చేసేయగలుగుతున్న బాలయ్యను మంత్రిగా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చాలాకాలంగా ఈ చర్చ కొనసాగుతున్నా, ఇప్పటివరకు ఎవరూ బయటకు అనలేదు. కానీ తాజాగా ఆయన నియోజకవర్గ పర్యటనలో కార్యకర్తలు ఈ విషయంపై రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం ఉదయం కిరికెర గ్రామానికి వెళ్లిన బాలయ్య స్థానికులతో చాలాసేపు మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత బసవనపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులను కలిసేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది కార్యకర్తలు ఆయన కారుకు అడ్డంగా నిల్చొని బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందని తమ కోరికను ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. మరికొందరు రోడ్డుకు ఇరువైపులా ‘బాలయ్య బాబు గారు మంత్రి పదవి తీసుకోవాలని అభిమానుల కోరిక’ అన్న బోర్డులు పట్టుకుని నిల్చొన్నారు. వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏదీ మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.
హిందూపురం నుంచి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బాలయ్య మాత్రం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవిపై ఆసక్తి చూపడం లేదు. ఆయన కోరుకుంటే మంత్రి అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, సామాజిక సమీకరణలు, మంత్రివర్గ కూర్పు వల్ల సాధ్యం కాదన్న విషయం తెలుసుకుని చంద్రబాబుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మంత్రి పదవికి దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, తాజాగా హిందుపురంలో కార్యకర్తల డిమాండ్ ను గమనిస్తే బాలయ్యను ఒకసారైనా అమాత్య హోదాలో చూడాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.