దేశాన్ని కుదుపుతున్న 'న‌ల్సార్' వివాదం.. ఏం జ‌రిగింది?

హైద‌రాబాద్‌లోని ప్ర‌తిష్టాత్మక నల్సార్ విశ్వ‌విద్యాల‌యానికి ఎంతో పేరుంది. మ‌న దేశం నుంచే కాకుండా.. ఇత‌ర దేశాల‌కు చెందిన విద్యార్థులు సైతం ఇక్క‌డ న్యాయ విద్య‌ను అభ్య‌సిస్తారు.

Update: 2026-08-17 03:56 GMT

హైద‌రాబాద్‌లోని ప్ర‌తిష్టాత్మక నల్సార్ విశ్వ‌విద్యాల‌యానికి ఎంతో పేరుంది. మ‌న దేశం నుంచే కాకుండా.. ఇత‌ర దేశాల‌కు చెందిన విద్యార్థులు సైతం ఇక్క‌డ న్యాయ విద్య‌ను అభ్య‌సిస్తారు. అలాంటి యూనివ‌ర్సిటీ గ‌త వారం రోజులుగా వివాదాల సుడిలో చిక్కుకుంది. విద్యార్థులు వ‌ర్సెస్ న్యాయ‌వ్య‌వ‌స్థ అన్న‌ట్టుగా సాగుతున్న ఈ వివాదం.. ఇప్పుడు 'క్ష‌మాప‌ణ‌'ల వ‌ర‌కు కూడా సాగింది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మ‌న‌న్‌కుమార్ మిశ్రా న‌ల్సార్ విశ్వ‌విద్యాల‌యం విద్యార్థుల‌కు సుదీర్ఘ క్షమాప‌ణ‌ల లేఖ రాశారు. త‌న‌ను క్షమించాల‌ని వేడుకున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కూడా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.

అస‌లేం జ‌రిగింది?

హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ న్యాయ విశ్వ‌విద్యాల‌యం స్నాత‌కోత్స‌వం ఈ నెలలో నిర్వ‌హించ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. కానీ, ఈలోగానే ఈ వ్య‌వ‌హారం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈస్నాత‌కోత్స‌వానికి.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ను ఆహ్వానించాల‌ని యూనివ‌ర్సిటీ పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ వ్య‌వ‌హారంబ‌య‌ట‌కు పొక్క‌డం తో మూకుమ్మ‌డిగా 300 మంది విద్యార్థులు ఈ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించారు. విద్యార్థులు, నిరుద్యోగుల‌పై గ‌తంలో జ‌స్టిస్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ.. ఆయ‌న‌ను ఆహ్వానించ‌డానికి వీల్లేదంటూ యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్‌కు లేఖ సంధించారు.

ఇక్క‌డే వివాదం ప్రారంభ‌మైంది. అయితే.. అనూహ్యంగా ఈ విష‌యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) జోక్యం చేసుకుంది. అస‌లు న్యాయ విద్య‌ను పూర్తిచేసుకున్న వారికి ఈ ఏడాది ప‌ట్టాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ.. యూనివ‌ర్సిటీకి లేఖ రాసింది. దీంతో వివాదం కాస్తా.. దేశ‌వ్యాప్తంగా పెద్ద‌దైంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలుసైతం.. తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాయి. అంతేకాదు.. సుప్రీంకోర్టులో బీసీఐ నిర్ణ‌యంపై పిటిష‌న్ కూడా దాఖ‌లైంది.

ఇక‌, ఈ వివాదంపై నేరుగా స్పందించి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. బీసీఐనే త‌ప్పుబ‌ట్టారు. విద్యార్థులు త‌మ అభిప్రాయాలు చెప్ప‌డం త‌ప్పుకాద‌న్న ఆయ‌న‌.. అస‌లు ఈ విష‌యంలో బీసీఐ ఎందుకు జోక్యం చేసుకుంద‌ని నిల‌దీశారు. అయితే.. తాను ఈ స్నాత‌కోత్స‌వానికి వ‌స్తాన‌ని కానీ, రాన‌ని కానీ జ‌స్టిస్ సూర్య‌కాంత్ చెప్ప‌లేదు. మ‌రోవైపు.. విద్యార్థులు నిర‌స‌న‌ను తీవ్ర‌త‌రం చేసేందుకు రెడీ అయ్యారు. దీనికి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కూడా మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంద‌ని వార్తలు గుప్పుమ‌న్నాయి. దీంతో బీసీఐ చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ స్పందించి.. శ‌నివారం రాత్రికి రాత్రి స్పందించారు.

విద్యార్థుల విష‌యంలో తాను రాసిన లేఖ‌(జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు వ్యతిరేకంగా సంత‌కాలు చేసిన విద్యార్థుల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌ద్దంటూ)పై చింతిస్తున్నాన‌ని పేర్కొన్నారు. దీనిని విద్యార్థులు లైట్ తీసుకోవాల‌ని.. వారికి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు న‌ల్సార్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల డిమాండ్‌, విశ్వ‌విద్యాల‌యం చేసిన ప్ర‌క‌ట‌న‌.. మ‌న‌న్ కుమార్ చేసిన హుకుం వంటివి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు రావ‌డం.. మేధావుల నుంచి న్యాయ నిపుణుల వ‌ర‌కు అంద‌రూ విద్యార్థుల ప‌క్షానే నిల‌బ‌డ‌డం వంటివి తీవ్ర‌స్థాయిలో కుదిపేశాయి. మొత్తానికి ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News