జగన్ స్ట్రాంగ్...వైసీపీ వీక్ !

ఇదేంటి అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. అదే సమయంలో అధినేత బలంగా ఉంటే పార్టీ వీక్ గా ఎలా ఉంటుంది అని మరో ప్రశ్న కూడా వస్తుంది.

Update: 2026-08-17 04:02 GMT

ఇదేంటి అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. అదే సమయంలో అధినేత బలంగా ఉంటే పార్టీ వీక్ గా ఎలా ఉంటుంది అని మరో ప్రశ్న కూడా వస్తుంది. కానీ వైసీపీలో తీరు చూస్తే మాత్రం ఇదే నిజం అనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ మోజు క్రేజూ ఏ రోజూ తగ్గలేదు, ఆయన ఏ ముహూర్తాన పార్టీ పెట్టి జనంలోకి వచ్చారో నాటి నుంచి ఆయనకు జనం మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. అంతే కాదు జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా హాజరు కావడం అంతా చూస్తున్నారు. అది గెలుపు ఓటములతో సంబంధం లేని విధంగా జగన్ కి ఉన్న ఇమేజ్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

జగన్ ఒక్కరితోనేనా :

జగన్ అంటే జనాలకు ఆదరణ ఉండొచ్చు. ఆయన మీద అభిమానం ఉండొచ్చు. కానీ జగన్ ఇమేజ్ వల్లనే గెలుపు దక్కుతుంది అనుకుంటే అది నూరు శాతం తప్పు అని 2024 ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి. జగన్ వైన్ నాట్ 175 అని గట్టిగా నమ్మారు. కానీ పార్టీ నేతలు సరిగ్గా పనిచేయలేకపోయారు. క్యాడర్ దూరం అయింది. దాంతోనే ఘోరమైన ఫలితాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అంతకు ముందు 2014 నుంచి 2019 మధ్యలో క్యాడర్ అనబడే అభిమానులు అంతా వైసీపీ కోసం గట్టిగా పనిచేశారు. అలాగే ఎక్కడ చూసినా పార్టీని బలమైన నాయకులు ఉండేవారు. కానీ 2024 తరువాత ఆ పరిస్థితి అయితే లేదని గుర్తు చేస్తున్నారు. చాలా మంది నాయకులు పార్టీని వీడిపోగా ఉన్న వారిలో అనేక మంది ఇంకా ఫీల్డ్ లోకి దిగలేదు, మరి కొందరు ఇంకా ఆలోచనలోనే ఉన్నారని అంటున్నారు.

జగన్ తోనే సందడి :

ఈ నేపథ్యంలో జగన్ ఎక్కడికైనా వెళ్తే చాలు ఆయనతోనే జనాలు కనిపిస్తారు. నాయకులు కూడా ఆ సందడిలో మెరుస్తారు. ఇక ఆ తరువాత ఆ హడావుడి ఏదీ ఆయా నియోజకవర్గాల్లో కనిపించదు. పార్టీని పట్టించుకుని ప్రతీ రోజూ జనంలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులు కానీ ఇంచార్జిలు కానీ వైసీపీలో తక్కువ మందే ఉన్నారని అంటున్నారు. ఇక అనేక మంది నాయకులు అయితే కేవలం మీడియా ముందుకు వచ్చి నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వీరంతా మీడియా బేబీలుగానే ఆయా చోట్ల పార్టీతో పాటు జనం అనుకుంటున్నారు. అయితే వీరి హడావుడి చూసి పార్టీ పెద్దలు మాత్రం బలమైన నేతలు అని మురిసిపోతే పప్పులో కాలేసినట్లే అని అంటున్నారు.

నేతలు కలిస్తేనే :

వైసీపీలో నేతలకు కొదవ లేదు, చాలా మంది ఉన్నారు. అయితే వారంతా యాక్టివ్ కావాల్సి ఉంది. అంతే కాదు ప్రజా సమస్యలను తాముగా గుర్తించి వాటి మీద ప్రభుత్వంతో పోరాడాల్సి ఉంది. ఇక క్యాడర్ ని ఈ రోజుకీ నాయకులు పట్టించుకోలేదని ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే కనుక ఉంటే మరోసారి క్యాడర్ సహాయ నిరాకరణ చేయవచ్చు అని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టగా తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం ఎన్ని సార్లు హెచ్చరించినా నాయకులలో అయితే పెద్దగా సీరియస్ నెస్ లేదని అంటున్నారు. ఇక జగన్ కి వస్తున్న జనాలను చూసి వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అని పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకూ అంతా మురిసిపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని అంటున్నారు. తాను జనంలోకి వెళ్ళడమే కాకుండా పార్టీ నేతలను కూడా నిత్యం జనంలో ఉండేలా అధినేత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీడియా ముందు కనిపించే వారు కాకుండా నిజంగా ఎవరు పనిచేస్తున్నారో గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.

Tags:    

Similar News