ఏపీ కాంగ్రెస్.. గోల్డెన్ చాన్స్ మిస్ !
ఏపీలో కాంగ్రెస్ కి ఇపుడు మంచి అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోంది.
ఏపీలో కాంగ్రెస్ కి ఇపుడు మంచి అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోంది. అలాగే విద్యార్థుల ఉద్యమాలతో యువత అసంతృప్తితో బీజేపీ నాయకత్వం సతమతమవుతోంది. ఇక పార్లమెంట్ లోపలా బయటా బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాహుల్ గాంధీ అయితే గట్టిగానే పోరాడుతున్నారు. మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలో కాంగ్రెస్ వికసించేందుకు దారులు వెతకాల్సి ఉండగా చడీ చప్పుడూ లేకుండా చతికిలపడిన వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు.
ఉద్యమాలు ఏవీ :
జెన్ జీ ప్రకంపనలు కానీ జంతర్ మంతర్ విద్యార్ధి ఉద్యమాల ప్రభావం కానీ దేశమంతా కనిపించింది. ఒక్క ఏపీలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ తాండవించింది. దానికి కారణాలు ఉన్నాయి. ఎన్డీయే ఏపీలో అధికారంలో ఉంది. జనసేన టీడీపీ బీజేపీలతో కూటమి ప్రభుత్వం ఉంది. మరి విపక్షంలో ఉన్న వైసీపీ అయినా జెన్ జీ తరఫున గొంతు ఎత్తిందా అంటే వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేక ఉద్యమం కాబట్టి గమ్మున ఉంది అన్న విమర్శలు వచ్చాయి. మరి ఇలా చూస్తే కనుక ఒక బంగారు లాంటి అవకాశం కాంగ్రెస్ కి ఇదే అని చెప్పాలి. విద్యార్ధి ఉద్యమాలను ఆసరాగా చేసుకుని యువతను కలుపుకుని కాంగ్రెస్ కనుక ఉద్యమాలు నిర్మించి ఉంటే ఈపాటికి ఎంతో కొంత బలం చేకూరేదని విశ్లేషణలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అయితే ఈ గోల్డెన్ చాన్స్ ని మిస్ చేసుకుంది అని అంటున్నారు.
ఉత్సహాం తగ్గిందా :
పీసీసీ చీఫ్ గా ఎన్నికైన తరువాత మొదట్లో షర్మిల బాగానే పర్యటనలు చేశారు. అనేక సమస్యల మీద ప్రజలతో ఉద్యమించారు. అయితే అప్పట్లో రాజకీయ వాతావరణం వేరుగా ఉంది. దాంతో కలిసి రాలేదు, కానీ ఇపుడు అలా కాదు సమాజంలో అతి పెద్ద వర్గంగా ఉన్న యువత పాలకుల తీరు మీద గుర్రుగా ఉంది. వారిని కలుపుకొని జనంలోకి వెళ్తే చాలు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ హస్త రేఖలు మారిపోతాయని అంటున్నారు. సరిగ్గా ఈ కీలక సమయంలోనే షర్మిల అయితే కొంత తగ్గినట్లుగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నారు అని వార్తలు వచ్చాయి. దాని వల్ల ఆమె రెస్ట్ తీసుకోవచ్చు కానీ పార్టీలో ఇతర నేతలు ఎవరూ కూడా లీడ్ తీసుకోకపోవడం వల్ల ఏపీలో కాంగ్రెస్ కి ఎత్తిగిల్లేందుకు వీలు లేకుండా పోతోంది అని అంటున్నారు.
అసంతృప్తి ఉందా అన్నదే :
అయితే షర్మిలకు అసంతృప్తి ఏమైనా ఉందా అన్న ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఆమెకు రాజ్యసభ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం మీద కూడా ఆవేదన అంటున్నారు. ఇచ్చిన మాటకు పార్టీ పెద్దలు కట్టుబడలేదన్న బాధ ఉండి ఉండొచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీ కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారు సైతం రంగంలోకి దిగకపోవడమే ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ కి బలం లేదని గతంలో కూర్చునే వారు. ఇపుడు అలా కాదు జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెరుగుతున్న వేళ ఏపీలో కూడా జోరు పెంచితే కచ్చితంగా మార్పు కనిపించేదని అంటున్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని కాంగ్రెస్ ఏకత్రాటిపైకి వచ్చి జనంలోకి వెళ్తే గతం కంటే ఎంతో కొంత బలం పెరుగుతుందని అంటున్నారు. మరో వైపు హైకమాండ్ కూడా ఏపీ విషయంలో ఏమి ఆలోచనలు చేస్తుందో తెలియక ఏపీ పార్టీ నేతలు గమ్మున ఉన్నారని కూడా టాక్ ఉంది.