`ఫ్యూచ‌ర్ లీడ‌ర్‌`గా జ‌గ‌న్‌కు ఎన్ని మార్కులు?

రాజకీయాల్లో ఉన్న నాయకులకు `భవిష్యత్తు` చాలా ముఖ్యం. ఉదాహరణకు టిడిపి అధినేత చంద్రబాబును తీసుకుంటే తన ప్రస్థానంలో భవిష్యత్తు నాయకుడిగా అనేకమందిని తీర్చిదిద్దారు.;

Update: 2025-09-06 04:05 GMT

రాజకీయాల్లో ఉన్న నాయకులకు `భవిష్యత్తు` చాలా ముఖ్యం. ఉదాహరణకు టిడిపి అధినేత చంద్రబాబును తీసుకుంటే తన ప్రస్థానంలో భవిష్యత్తు నాయకుడిగా అనేకమందిని తీర్చిదిద్దారు. అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎక్కువమంది నాయకులను దేశానికి, రాష్ట్రానికి కూడా అందించారు. అందుకే చంద్రబాబు అంటే `ఫ్యూచర్ లీడర్` గా ఎక్కువమంది చెబుతారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎత్తు పల్లాలు సహజం. వాటిని తట్టుకుని ఎదిగిన నాయకుడు మాత్రమే ఫ్యూచర్ నేతగా ప్రజల్లో గుర్తింపు దక్కించుకుంటారు.

ఈ లక్షణాలు చంద్రబాబులో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. వాటిని అధిగ‌మించి అధికారంలోకి వచ్చారు. బలమైన నాయకుడిగానే కాకుండా.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన నేతగా ఆయన అందరిలోనూ పేరు సంపాదించుకున్నారు. ఈ తరహాలో చూసినప్పుడు ఫ్యూచర్ నేతగా వైసీపీ అధినేత జగన్‌కు ఎన్ని మార్కులు పడుతున్నాయి? ఆయన ద్వారా ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి ఎంతమంది నాయకులు పరిచయం అవుతున్నారు? అనే విషయం గమనిస్తే ఏమీ లేదనే సమాధానమే వినిపిస్తోంది.

ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఇంకా జగన్‌కు తెలియడం లేదన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న కారణంతో అసెంబ్లీకి వెళ్లకపోవడం, జాతీయ స్థాయిలో అసలు ఒక వ్యూహమే లేకుండా వ్యవహరించటం వంటివి జగన్‌కు ఫ్యూచర్ నేతగా రావాల్సిన మార్కులు రావడం లేదు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. కేంద్రంతో విభేదిస్తున్నానంటారు... కానీ కేంద్రానికి మద్దతిస్తారు. బిజెపితో విభేదాలు అంటారు.. కానీ బీజేపీ నాయకులతోనే అంట కాగుతారు.

ఇక రాష్ట్రానికి వచ్చేసరికి సమస్యల మీద పోరాటమే లేదు. తన పాలనే స్వర్గసీమ అని ఇప్పటికీ ప్రచారం చేస్తారు. కానీ, ఓటమిపై ఇప్ప‌టి వరకు సమీక్ష చేయటం కానీ తప్పులను సరిచేసుకునే దిశగా అడుగులు వేయటం కానీ ఆయన ఇంతవరకు చేయలేకపోయారు. ఇక, నాయకుల విషయాన్ని చూసుకుంటే జగన్ ఎవరినైతే నాయకులుగా ప్రాజెక్టు చేశారో.. ఇప్పుడు దాదాపు వారిలో సగానికి పైగా నాయకులు జైల్లోనే ఉన్నారు. కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీరికి ప్రజల్లోనూ పెద్దగా బలం కనిపించడం లేదు.

పోనీ భవిష్యత్తులో అయినా జగన్ పుంజుకునే అవకాశం ఉందా.. అంటే ఆ త‌ర‌హా వ్యూహాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఫ్యూచర్ నేతగా జగన్‌కు ఎన్ని మార్కులు పడతాయి అంటే ప్రస్తుతానికైతే `జీరో` అనే సమాధానమే వినిపిస్తోంది. చంద్రబాబుతో తనను తాను కంపేర్ చేసుకుని సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారం మినహా... ప్రజల్లో కనిపిస్తున్న సానుకూలత, సానుభూతి వంటివి జగన్‌కు ఎక్కడా కనిపించకపోవడం, భవిష్యత్తు నాయకుడిగా ఆయనకు పెద్ద ఇబ్బందికర పరిణామాన్ని తీసుకువస్తుంది అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News