జగనన్న ముద్దు.. రోజా వద్దు.. ఇదేం పంచాయితీ?

తాజాగా ఆమె తీరుపై మండిపడుతూ సొంత పార్టీకి చెందిన నేతలు పలువురు తిరుపతిలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Update: 2024-03-12 04:39 GMT

ఇంట్లో ఈగల మోత.. ఊళ్లో పల్లకీ మోత అన్న సామెతకు తగ్గట్లుగా ఉంది ఏపీ మంత్రి ఆర్కే రోజా తీరు. నిద్ర లేచింది మొదలు తన రాజకీయ ప్రత్యర్థులకు.. ప్రత్యర్థి పార్టీలకు నీతులు.. ఉపనిషత్తులు చెప్పటమే కాదు అడగకున్నా సలహాలు.. సూచనలు చేస్తుంటారు. అక్కడితో ఆగకుండా తనకు మాత్రమే సాధ్యమయ్యే హావభావాలు.. మధ్య మధ్యలో నవ్వులతో తిట్ల దండకాన్ని కాస్తంత ఘాటుగా సంధించే ఆమె మాటల్ని విన్నప్పుడు.. ఏం చెప్పారు రోజా? అనకుండా ఉండలేని పరిస్థితి.

ఇన్ని తెలిసిన ఆర్కే రోజాకు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే వర్గాన్ని.. అసమ్మతిని బుజ్జగించాలన్న చిన్న పాయింట్ ఎందుకు తట్టదన్నది ప్రశ్న. ఏళ్లు ఏళ్లుగా సాగుతున్న అసమ్మతిని అంతకంతకూ పెంచుకుపోవటమే కానీ తుంచటం చేతకాని ఆమె తీరుతో ఇప్పుడు ఫలితాల్ని చవి చూసే పరిస్థితి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే రోజాకు టికెట్ ఇవ్వొద్దన్న నగరి వైసీపీ నేతల వాయిస్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Read more!

తాజాగా ఆమె తీరుపై మండిపడుతూ సొంత పార్టీకి చెందిన నేతలు పలువురు తిరుపతిలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరిలో మంత్రి రోజా కుటుంబ పాలన సాగుతుందని ఆరోపిస్తూ.. రోజా వద్దు.. జగనన్న ముద్దు అంటూ కొత్త ప్రచారాన్ని షురూ చేశారు. తామంతా నగరి నియోజకవర్గంలోని రోజా బాధితులమని పేర్కొంటూ.. ఆమె అన్నదమ్ముల అక్రమ సంపాదన.. దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయినట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం.

గత ఎన్నికల్లో రోజా గెలుపు కోసం తాము కష్టపడ్డామని.. కానీ తమ పంచాయితీలో ఒక్క పని జరగలేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కానీ రోజాకు నగరి టికెట్ ఇస్తే పని చేసేది లేదంటూ భీష్మించుకోవటమే కాదు పార్టీకి అల్టిమేటం ఇచ్చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజాను వద్దంటున్న తమకు జగనన్న ఆరాధ్యనీయులని వారు స్పష్టం చేస్తున్నారు. రోజా వద్దు.. జగనన్న ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని మరీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. రోజా కళ్లు తెరవాలంటున్నారు. ఐదేళ్లలో చేయని పనిని ఆమె.. ఇప్పుడు చేస్తారా? అన్నదే అసలు ప్రశ్న.

Tags:    

Similar News