నాగబాబు అసహనం...క్యాడర్ కి సందేశం !
పార్టీ ముఖ్య నాయకుడు తమ వద్దకు వచ్చారు అంటే తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రతీ కార్యకర్త ఆలోచిస్తారు. ఇది అత్యంత సహజం.;
పార్టీ ముఖ్య నాయకుడు తమ వద్దకు వచ్చారు అంటే తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రతీ కార్యకర్త ఆలోచిస్తారు. ఇది అత్యంత సహజం. ఎందుకు అంటే ఏ కార్యకర్త పనిగట్టుకుని పెద్ద నాయకుల వద్దకు వెళ్ళలేరు. వెళ్ళినా అపాయింట్మెంట్ దొరకదు. అందుకే తమ గోడు చెప్పుకోవాలని వారు నాయకులు వచ్చినపుడే చూస్తారు. మరి అలా వచ్చిన వారి ఆవేదన వినకుండా అసహనం వ్యక్తం చేస్తే క్యాడర్ కి ఇచ్చే సందేశం అని నిరాశ చెందుతారు కదా. విశాఖలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటనలో క్యాడర్ పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు.
గోడు వినండి అంటే :
పేరుకు మాత్రమే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. పెత్తనం మాత్రం టీడీపీ వారిదే అని ఒక కార్యకర్త నాగబాబు ముందు వెళ్లబోసుకున్నారు. విశాఖ దక్షిణంలో జరుగుతున్న కూటమి రాజకీయాల గురించి ఏకరువు పెట్టారు. చిత్రమేంటి అంటే పక్కన అదే దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇక దక్షిణానికి చెందిన గోపీనాధ్ అనే కార్యకర్త విశాఖ దఖిణంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ నాయకుల ఆధిపత్యం ఎక్కువ అయ్యింది అని నాగబాబు దృషిటికి తెచ్చారు. ఈ విషయం ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి అని నాగబాబుకు కోరారు. అయితే కార్యకర్త గోపికృష్ణ ఈ విషయం చెబుతుండగా అసహనానికి గురైన నాగబాబు వెంటనే ఆయన మైక్ కట్ చేయాలని ఆదేశం ఇచ్చేశారు. దాంతో బిత్తర పోవడం ఆయనతో పాటు మొత్తం క్యాడర్ వంతు అయింది.
పార్టీకి జీవగర్ర :
కార్యకర్తలు అంటే పార్టీకి జీవగర్ర. వారే లేకపోతే ఏ పార్టీకి అయినా మనుగడ లేదు. ఆ విషయం చాలా పార్టీల పరాభవంతో చరిత్రలో నిరూపితం అయింది. ఇక జనసేనకు ఎంత అదృష్టం అంటే ప్రాణం పెట్టే అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. వారు తమ బాధను నాయకుల ముందు వెళ్ళబోసుకుంటారు. వాటిని విని తమకు తోచిన సలహాలు సూచనలు ఇస్తే వారు మారు మాట్లాడకుండా అలా మళ్ళీ తమ పనిలో నిమగ్నం అయిపోతారు. కానీ నాగబాబు చేసిందేంటి అన్న చర్చ అయితే సాగుతోంది. కార్యకర్తల అభిప్రాయాలు అవసరం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.
అసలు సమావేశాలు ఎందుకు :
ఊరకే పలకరించి పోవడానికేనా సమావేశాలు అని అంటున్నారు పార్టీ కార్యకర్తల సమస్యలు వినలేని ఓపిక లేనపుడు మీటింగులు ఎందుకు పెట్టడం అని అంటున్నారు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బ తింటే తిరిగి దానిని నిలబెట్టడం కష్టం అని అంటున్నారు. సదరు కార్యకర్త కూడా తమ సమస్యలను అధినాయకత్వానికి తెలియజేయాలని కోరారు. సరే చూస్తామని చెబితే తప్పేముంది అని అంటున్నారు. ఒకవేళ కార్యకర్త చెప్పినది కరెక్టో కాదో అన్నది ఎమ్మెల్యే పక్కనే ఉన్నారు కదా ఆయన నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కదా అని కూడా అంటున్నారు.
జనసేనలో మధనం :
జనసేనలో ఇపుడు అంతర్మధనం జరుగుతోంది. పార్టీ కోసం సర్వస్వం పెట్టిన వారు తగిన గుర్తింపు కోరుకుంటారు. ఆ కార్యకర్త చెప్పినది కూడా తమ నియోజకవర్గంలో టీడీపీ ఆధిపత్యమే ఎక్కువగా ఉందని తమకు తగిన గుర్తింపు లేదని. మరి దాని మీద పరిశీలిస్తామని చెబితే మొత్తం కార్యకర్తలకే అది ఒక మంచి సందేశంగా ఉండేది కదా అని అంటున్నారు. అయినా నాగబాబు అంతలా అసహనం వ్యక్తం చేయాల్సినంది ఏముంది అని అంటున్నారు. ఇదే కాదు ఒక మహిళా కార్పోరేటర్ విషయంలోనూ ఇలాగే సమస్యల గురించి మాట్లాడుతూంటే మైక్ కట్ చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే సమీక్షలు సమావేశాలు పేరుతో ఎవరూ పార్టీలో సమస్యలు చెప్పకూడంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.