ఎలాన్ మస్క్.. కానీ లగ్జరీ లైఫ్‌కు నో, సింపుల్ లైఫ్‌కే ఓటు!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనప్పటికీ మస్క్ ఇలాంటి సాధారణ జీవితాన్ని గడపడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

Update: 2026-06-16 15:30 GMT

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ జీవనశైలి మరోసారి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. స్పేస్‌ఎక్స్ సంస్థ జూన్ 12 2026న నిర్వహించిన భారీ ఐపీఓ విజయవంతం కావడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఇంతటి అపార సంపద కలిగిన వ్యక్తి ఇప్పటికీ కేవలం 400 చదరపు అడుగుల చిన్న ఇంటిలోనే నివసిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆ చిన్న ఇంటి విశేషాలు ఏంటి?

టెక్సాస్ రాష్ట్రంలోని బోకా చికా ప్రాంతంలో స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక చిన్న ప్రీఫ్యాబ్రికేటెడ్ హౌస్‌లో మస్క్ తన ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. హౌసింగ్ స్టార్టప్ 'బాక్సాబ్ల్' రూపొందించిన ఈ ఇంటి విలువ సుమారు 50,000 డాలర్లు (రూ. 41 లక్షలకు పైగా) మాత్రమే. ఇందులో ఒక చిన్న లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్ , సాధారణ బాత్‌రూమ్ మాత్రమే ఉన్నాయి. మస్క్ గతంలో ఈ ఇంటిని “చాలా బాగుంది‘‘ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

ఈ ఇల్లు పరిమాణంలో చిన్నదైనప్పటికీ అధునాతన సాంకేతికతతో రూపొందించబడింది. ఇందులో స్పేస్ ఆదా చేసే మర్ఫీ బెడ్.. గోడల్లోనే అమర్చిన బిల్ట్-ఇన్ స్టోరేజ్ క్యాబినెట్లు.. ఆధునిక కిచెన్ ఉపకరణాలు.. పర్యావరణ అనుకూలమైన ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచంలోని ఇతర కోటీశ్వరుల విలాసవంతమైన భవనాలతో పోలిస్తే ఇది అత్యంత సాధారణమైనదిగా చెప్పవచ్చు.

ఆస్తుల అమ్మకం.. నిర్ణయానికి కట్టుబడి!

2020లో తన వ్యాపార కార్యకలాపాలను కాలిఫోర్నియా నుండి టెక్సాస్‌కు తరలించిన తర్వాత మస్క్ తన విలాసవంతమైన ఆస్తులన్నింటినీ విక్రయించారు. “నేను ఎలాంటి ఇల్లు సొంతంగా ఉంచుకోను.. భౌతిక ఆస్తులను వదిలించుకుంటాను” అని ఆయన ప్రకటించారు. తన మాటలకు కట్టుబడి కాలిఫోర్నియాలోని తన ఏడు భవనాలను అమ్మేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సంస్థలు ఆస్టిన్ సమీపంలోని వెస్ట్ లేక్ హిల్స్ ప్రాంతంలో పెద్ద విల్లాలను కలిగి ఉన్నప్పటికీ మస్క్ మాత్రం ఎక్కువగా ఈ 400 చదరపు అడుగుల బాక్సాబ్ల్ ఇంట్లోనే నివసిస్తుండటం విశేషం.

మేయ్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎలాన్ మస్క్ తల్లి మేయ్ మస్క్ కూడా గతంలో ఈ ఇంటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకసారి తాను అక్కడ బస చేసినప్పుడు “ఫ్రిజ్‌లో తినడానికి ఏమీ లేదు” అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అంతేకాదు అక్కడ స్థలం సరిపోకపోవడంతో గ్యారేజీని తాత్కాలిక బెడ్‌రూమ్‌గా మార్చి నిద్రించామని.. తామిద్దరం ఒకే టవల్‌ను పంచుకుని ఉపయోగించామని ఆమె పేర్కొన్నారు.

ఇంతటి వైరాగ్యానికి కారణం ఏంటి?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనప్పటికీ మస్క్ ఇలాంటి సాధారణ జీవితాన్ని గడపడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో విలాసవంతమైన జీవితం కంటే పనికి, లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెస్లా సంస్థలో కీలక ఉత్పత్తి దశలు నడుస్తున్నప్పుడు ఆయన కాలిఫోర్నియా ఫ్యాక్టరీలోని సోఫాపై, నేలపైనే నిద్రించిన సందర్భాలు ఉన్నాయి.

మస్క్ అభిప్రాయం ప్రకారం.. భౌతిక సౌకర్యాలు, పెద్ద పెద్ద ఆస్తుల నిర్వహణ మనిషి దృష్టిని మరలుస్తాయి. మానవాళి భవిష్యత్తును అంతరిక్షంలో విస్తరించడం, అంగారకుడి పై మానవ నివాసాలను ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణ కోసం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడమే ఆయన ప్రధాన లక్ష్యాలు. ఈ సుదూర లక్ష్యాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించేందుకే ఆయన లగ్జరీ జీవితానికి దూరంగా ఉంటున్నారు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన తర్వాత కూడా ఎలాంటి హంగులు లేకుండా ఒక సాధారణ కార్మికుడిలా 400 చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న ఎలాన్ మస్క్ నిర్ణయం ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది. సంపద అనేది కేవలం లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనం మాత్రమేనని.. విలాసాల కోసం కాదని ఆయన మరోసారి నిరూపించారు. సంపద కంటే ఆశయమే మిన్న అని నమ్మే ఇలాంటి వ్యక్తులు చరిత్రలో అరుదుగా ఉంటారు.

Tags:    

Similar News