నేతలకు కొర్రీలు.. అధికారులకు సొమ్ములు: బాబు వినూత్న నిర్ణయం
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు .. ఈ విధానాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.;
మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సంబంధించి.. కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పురపాలికల్లో ప్రస్తుతం పలు ఆస్తులను అద్దెకు ఇచ్చి.. వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, తిరుపతి, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప ఉమ్మడి జిల్లాల్లోని నగర పాలక సంస్థలకు అద్దెలు, స్థలాల లీజుల ద్వారా భారీ ఎత్తున ఆదాయం వస్తోంది.
ఇలా వస్తున్న ఆదాయాన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని కౌన్సిళ్లు తీసుకుని.. వాటిని ఖర్చు పెడుతున్నాయి. ప్రస్తుతం కూడా అలానే జరుగుతోంది. అయితే.. ఇలా కార్పొరేషన్ లోని మేయర్‌లు, కౌన్సిల్ చైర్మన్‌లు.. నిధులు తీసుకుని స్వయంగా ఖర్చు చేస్తున్న క్రమంలో.. నిధుల దుర్వినియోగం పెరిగిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు .. ఈ విధానాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
దీనిలో భాగంగా.. అధికారులకే సదరు నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. అద్దెలు, లీజుల రూపంలో వస్తున్న ఆదాయాలను.. ప్రత్యేక ఖాతాల్లో వేసి.. వాటిని కార్పొరేషన్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల అధీనంలో ఉంచనున్నారు. వారే స్వయంగా ఆయా నిధులను ఖర్చు చేసేలా జీవో తీసు కువస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే.. నగరాలు, పట్టణాలు మరింత అభివృద్ది చెందడంతోపాటు.. ప్రాధాన్యాల వారిగా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్న ఆలచనతో ఉన్నారు.
అయితే.. ఈ నిర్ణయం బాగానే ఉన్నా.. రాజకీయంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఉన్నవారు.. దీనిని వ్యతిరేకిస్తున్నారు. నిధుల వినియోగం అనేక కీలక బాధ్యత, అధికారం తమకు లేకుండా పోతే.. ఇక తాము చేసేది ఏముంటుందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం వైసీపీ 90 శాతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారంలో ఉంది. రేపు.. టీడీపీ వాటిని కైవసం చేసుకుంటే.. అప్పుడు కూడా.. ఇదే విధానం పాటిస్తే.. తమకు ఇక, ప్రాధన్యం లేకుండా పోతుందన్న చర్చ తెరమీదకి వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి.