9 మందితో 1BHKలో నివశించిన అంబానీ?
ముఖేష్ అంబానీ ఇప్పుడు గొప్ప ధనవంతుడు కావచ్చు కానీ.. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో 9 మంది మధ్య నివసించిన రోజులు ఉన్నాయనేది ఎవరికీ తెలీదు.;
బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నారు. అతడు విలాసపురుషుడు. తన ఇంట్లో పెళ్లిళ్ల కోసం వేల కోట్లు ఖర్చు చేసిన ఘనుడు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం ఏకంగా 10,000 కోట్లు ఖర్చు చేయడం ఇటీవల చర్చనీయాంశమైంది. రొటీన్ లైఫ్ లోను సొంత విమానాల్లో ప్రయాణించే ఈ మల్టీబిలియనీర్ వ్యాపార దిగ్గజం విలాసాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అంత లావిష్‌గా విలాసవంతంగా జీవించే ముఖేష్ అంబానీ ఒకప్పుడు 9 మందితో సింగిల్ బెడ్ రూమ్ లో నివశించాడనేది మీకు తెలుసా?
ముఖేష్ అంబానీ ఇప్పుడు గొప్ప ధనవంతుడు కావచ్చు కానీ.. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో 9 మంది మధ్య నివసించిన రోజులు ఉన్నాయనేది ఎవరికీ తెలీదు. కొన్నేళ్ల క్రితం సిమి గెరేవాల్ తో జరిగిన ఇంటర్వ్యూలో అంబానీ స్వయంగా దీనిని వెల్లడించారు. నిజానికి ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని అంటారు ముఖేష్ అంబానీ.. మరపురాని స్వీటెస్ట్ డేస్ అని అంటారు.
అలాగే అందరు తండ్రుల్లానే తన తండ్రి ధీరూభాయ్ అంబానీ తనను, తన తమ్ముడు అనీల్ అంబానీని శిక్షించాడని కూడా ముఖేష్ అంబానీ తెలిపాడు. తమ అల్లరి, దురుసుతనాన్ని తట్టుకోలేక శిక్షించాడని, ఒకరోజు గ్యారేజీకి పంపాడని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ధీరూభాయ్ కుటుంబం అతిథులను ఇంటికి ఆహ్వానించింది. ఇద్దరు సోదరులు అతిథుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని తిని సోఫాపైకి ఎక్కి దూకారు. ఆ క్షణంలో అతిథుల ముందు వారిని ఏమీ అనలేదు. ధీరూభాయ్ అప్పటికి సరదాగా నవ్వేసినా కానీ, మరుసటి రోజు కొడుకులిద్దరినీ గ్యారేజీలో ఉండాల్సిందిగా ఇంటి నుంచి బహిష్కరించాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడాలని కొడుకులిద్దరికీ చెప్పాడు. ఆ సమయంలో ముఖేష్ వయసు 10 సంవత్సరాలు.
అలాగే ముఖేష్ అంబానీ తన తండ్రికి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసాడు. 1986 లో ఇంట్లో అందరూ క్రికెట్ చూస్తుండగా, తనకు వెన్ను నొప్పింగా ఉందని చెప్పిన ధీరూభాయి ఆ తర్వాత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. అప్పటికి ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్నారు. నిజానికి ఆస్పత్రిలో మేల్కొన్నప్పుడు ఏం జరిగింది.? ఎక్కడ ఉన్నాను? అని ఆయన అడగలేదు. ``చింతించకండి.. నేను బయటపడతాను!`` అని అన్నారు. 2002లో ధీరూభాయ్‌కు రెండవసారి స్ట్రోక్ వచ్చి మరణించాడు. అంబానీ కుటుంబానికి అది అతి పెద్ద లోటు. ఒక కుర్చీ.. ఒక టేబుల్.. ఒక ఫోన్ తో ధీరూభాయి అంబానీ తన వ్యాపారాన్ని ప్రారంభించి వందల కోట్ల సామ్రాజ్యాన్ని తయారు చేయగా, నేడు ముఖేష్ అంబానీ మల్టీబిలియన్ డాలర్ కంపెనీలను నడిపిస్తున్నారు.