దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు జియో.. ఆ లెక్కలివే!
పరిచయం చేయాల్సిన అవసరం లేని సంస్థ జియో. ముకేశ్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ జియో మరో చరిత్రకు తెర తీసేందుకు కసరత్తు చేస్తోంది.;
పరిచయం చేయాల్సిన అవసరం లేని సంస్థ జియో. ముకేశ్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ జియో మరో చరిత్రకు తెర తీసేందుకు కసరత్తు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది ప్రధమార్థంలోనే ఈ ఐపీవో ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకూ మార్కెట్ నుంచి రిలయన్స్ జియో సమీకరించాలనుకుంటున్న నిధులు దగ్గర దగ్గర రూ.36వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అదెలా? అంటే.. దానికో లెక్కుంది. గత నవంబరులో జియో విలువను రూ.16.20 లక్షల కోట్లుగా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జెఫ్రీన్ అంచనా వేసింది. తాజాగా తమ వాటాలో 2.5 శాతం వాటాను విక్రయించాలన్నది రిలయన్స్ ప్లానింగ్ గా చెబుతున్నారు. ఈ అంచనాలన్ని నిజమైతే.. దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు వెళ్లిన సంస్థగా రిలయన్స్ జియో హిస్టరీ క్రియేట్ చేసతుందని చెప్పాలి. ఇప్పటిరకే 50 కోట్ల మందికి పైగా చందాదారులతో దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ గా వ్యవహరిస్తున్న జియో.. గడిచిన ఆరేళ్లుగా ఏఐ లాంటి వైవిధ్య విభాగాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
జియో ఐపీవో కోసం దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోనే అతి పెద్ద ఐపీవో అంటే.. 2024లో రూ.27,870 కోట్లకు ఐపీవోకు వెళ్లిన హ్యుందాయ్, రూ.21,008 కోట్లకు 2022లో ఐపీవోకు వెళ్లిన ఎల్ఐసీ, రూ.18,300 కోట్లకు 2021లో ఐపీవోకు వెళ్లిన పేటీఎంలు కనిపిస్తాయి. ఇవే కాకుండా 2017లో జీఐసీ (రూ.11,176 కోట్లు), ఎన్ఐఏ (రూ.9600 కోట్లు), 2021లో రూ.9375 కోట్ల ఐపీవోకు జొమాటో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ఐపీవోకు మించిన భారీ మొత్తంతో రిలయన్స్ జియో ఐపీవోకు వెళ్లనుంది.
రిలయన్స్ జియో ఐపీవోకు సంబంధించిన ముసాయిదాను రెఢీ చేసేందుకు ఇద్దరు ప్రముఖ బ్యాంకర్లు పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ జెయింట్ ఐపీవో ఎప్పుడు ఉంటుందన్న దానికి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం వెలువడొచ్చని చెబుతున్నారు. ఐపీవోకు ముందే ఇంత భారీగా చర్చ జరుగుతున్న వేళ.. అధికార ప్రకటన వెలువడిన తర్వాత మరెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.