ముద్రగడ కూతురు...కొడుకు ఆ సీటు నుంచి ఢీ కొడతారా ?
ఇక కొంతమంది నేతలను సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తమ పార్టీలోకి తీసుకుంటున్నారు ఇక ముద్రగడ మాత్రం ప్రత్తిపాడులో ఒకనాటి రాజకీయ వైభవానికి చూస్తున్నారు.;
ముద్రగడ కుటుంబానికి అచ్చి వచ్చిన సీటు నుంచి ఆయన వారసులు ఒకరి మీద ఒకరు పోటీ చేస్తారా. 2029 ఎన్నికల్లో పోటీ పడతారా. అటు చూస్తే కూతురు, ఇటు చూస్తే కొడుకు ఇలా ఇద్దరూ సై అంటారా. ప్రస్తుతం ముద్రగడ ఫ్యామిలీలో పొలిటికల్ ట్విస్టులు చాలా కనిపిస్తున్నాయి.
ముద్రగడ పద్మనాభం తొలిసారి గెలిచిన సీటు తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు. అక్కడ నుంచి 1978, 1983, 1985, 1989 ఇలా వరసగా నాలుగు సార్లు గెలిచారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవయ్య అయితే 1962, 1967లలో రెండు సార్లు వరసగా ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటారు.
అయితే తనను 1994 ఎన్నికల్లో ఓడించిన ప్రత్తిపాడు నుంచి మళ్లీ పోటీ చేయను అని ముద్రగడ భారీ శపధం చేసి మరీ ఆ వైపు చూడడం లేదు. ఇపుడు తన కుమారుడు గిరిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్యేగా చూసేందుకు తన తండ్రి తన సొంత నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు వైపు ఆయన చూస్తున్నారు. అక్కడ నుంచి 2029 ఎన్నికల్లో పోటీకి వైసీపీ తరఫున టికెట్ అయితే గిరికి ఖాయమని అంటున్నారు. ఆయనే ఇప్పటికే ఇంచార్జిగా ఆ పార్టీకి ఉన్నారు.
అయితే గిరిని ఇంచార్జిగా నియమించడం మీద వైసీపీలో వర్గ పోరు అయితే సాగుతోంది. గిరికి ఎపుడైతే బాధ్యతలు అప్పగించారో ఆనాటి నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు పర్వత ప్రసాద్ పూర్తిగా మౌన ముద్ర దాలుస్తున్నారు. మరో వైపు చూస్తే ముద్రగడకు వ్యతిరేకంగా నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు మదునూరి మురళీక్రిష్ణం రాజు పావులు కదుపుతున్నారు. ఈ వర్గ పోరుతో ప్రత్తిపాడు వైసీపీ సతమతం అవుతోంది.
ఇక కొంతమంది నేతలను సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తమ పార్టీలోకి తీసుకుంటున్నారు ఇక ముద్రగడ మాత్రం ప్రత్తిపాడులో ఒకనాటి రాజకీయ వైభవానికి చూస్తున్నారు. తన కుమారుడికి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తపన పడుతున్నారు.
అయితే వైసీపీ వర్గాలతో పాటు జనసేనలో చేరిన ఆయన కుమార్తె క్రాంతి కూడా ఇపుడు రాజకీయ ప్రత్యర్ధిగా ఎదురు నిలిచారు. ఆమె ఇటీవల కాలంలో ప్రత్తిపాడు మీద కన్ను వేశారు అని అంటున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. వైసీపీలో వర్గ పోరు తనకు కలసి వస్తుందని వారిలో కొందరిని జనసేన వైపు తిప్పుకుంటున్నారు.
మరో వైపు తాను కూడా ముద్రగడ రాజకీయ వారసురాలినే అని ఆమె ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ముద్రగడ వైసీపీలో ఉండడం ఆయన పేరుని పద్మనాభరెడ్డి గా మార్చుకోవడం ఇష్టం లేని వర్గాలు ఇపుడు క్రాంతికి మద్దతు ఇస్తున్నాయని అంటున్నారు. ఆమె దాంతో దూకుడు ఒక్కసారిగా పెంచుతున్నారు అని అంటున్నారు.
జనసేనలో ఆమెకు ముద్రగడ కుమార్తెగా గుర్తింపు ప్రత్యేకంగా ఉంది. దాంతో 2029 ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ పొత్తులో భాగంగా తెచ్చుకుంటే ఏకంగా తన అన్నదమ్ముడు గిరి మీదనే పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. ఈ పరిణామాలతో ముద్రగడకు ఎలా ముందుకు అడుగు వేయాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.
అయితే జనసేన తరఫున క్రాంతి టికెట్ తెచ్చుకుంటే మాత్రం ఆమెని గెలిపించే బాధ్యత మాది అని బలమైన సామాజిక వర్గం అంటోందిట. అపుడు ముద్రగడ కూడా జనసేనలోకి వస్తారని ఊహిస్తోందిట. మొత్తానికి అయితే ముద్రగడకు ఒక వైపు కూతురు ప్రత్యర్ధిగా మారితే మరో వైపు కుమారుడి రాజకీయ భవిష్యత్తు మీద పెద్దాయన కలవరపడుతున్నారుట.