సగం అయిపోయింది... ఈ ఐపీఎల్ లో ధోని ఆడుతాడా? లేదా?

ధోని వయసు ప్రస్తుతం 40 దాటింది. గత కొన్ని సీజన్లుగా అతను తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2026-04-28 17:30 GMT

భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని పేరు ఒక ప్రభంజనం. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. మైదానంలో హెలికాప్టర్ షాట్లు చూడాలని, 'థలా' మెరుపులను ఆస్వాదించాలని కోట్లాది మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మళ్లీ అదే ఉత్సాహం.. అదే ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ధోని ఎలివేషన్లు హోరెత్తుతున్నాయి. "రేపు వస్తాడు.. మాపు వస్తాడు.. బరిలోకి దిగుతాడు.. దుమ్ము లేపుతాడు" అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ ఈ హడావిడి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితి ఏమిటి? ధోని నిజంగానే బరిలోకి దిగుతాడా? లేక ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఫిట్‌నెస్ సవాల్.. మేనేజ్‌మెంట్ వ్యూహం

ధోని వయసు ప్రస్తుతం 40 దాటింది. గత కొన్ని సీజన్లుగా అతను తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడం అతనికి పెద్ద సవాల్‌గా మారింది. ఇటీవల ప్రాక్టీస్ సెషన్‌లో ధోని మళ్లీ గాయపడినట్లు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ధోని ఫిట్‌గా ఉన్నాడని పైకి చెబుతున్నా, తెర వెనుక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సమాచారం. ఒక సందర్భంలో ధోని స్వయంగా మాట్లాడుతూ "తాను స్ట్రెచర్‌ మీద ఉన్నా కూడా ఆడించేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉంటుంది" అని వ్యాఖ్యానించడం జట్టులో అతని ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషణ.. అసలు ట్విస్ట్ ఇదేనా?

ధోని రీ-ఎంట్రీపై చెన్నై మాజీ ఆటగాడు, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అశ్విన్ విశ్లేషణ ప్రకారం.. ధోనిని ఇప్పుడప్పుడే బరిలోకి దించే అవకాశం లేదు. దానికి ఆయన ప్రధానంగా రెండు కారణాలను విశ్లేషించారు. ప్రస్తుతం చెన్నై ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కీలకం. ఇలాంటి సమయంలో ఫిట్‌నెస్ సమస్యలు ఉన్న ధోనిని ఆడించి రిస్క్ తీసుకోవడానికి మేనేజ్‌మెంట్ ఇష్టపడదు. జట్టు గెలుపు గుర్రాలపైనే పందెం కాయాలని చూస్తుంది. ఒకవేళ చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటే.. అప్పుడు ధోనిని మైదానంలోకి దించే అవకాశం ఉంటుంది. ఇది జట్టు ప్రయోజనం కంటే, అభిమానుల కోసమే ఎక్కువగా ఉంటుంది. స్టేడియాలకు ప్రేక్షకులను రప్పించడం.. ధోనికి ఒక ఘనమైన వీడ్కోలు పలకడం మేనేజ్‌మెంట్ ఆలోచన కావచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

మార్కెటింగ్ గిమ్మిక్కా? లేక గౌరవమా?

అశ్విన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోని వంటి దిగ్గజ ఆటగాడిని కేవలం మార్కెటింగ్ కోసం, టికెట్ల అమ్మకాల కోసం వాడుకుంటారా? అని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సంప్రదాయం ప్రకారం ఆటగాళ్లకు ఇచ్చే గౌరవం విలువైందని ధోని ఎప్పుడు ఆడాలనేది అతని శారీరక స్థితిని బట్టే నిర్ణయిస్తారని వారు వాదిస్తున్నారు.

ధోని కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు.. చెన్నై జట్టుకు ఒక ఎమోషన్. అతను మైదానంలో ఉంటే వచ్చే జోష్, ఇచ్చే సలహాలు జట్టుకు కొండంత బలం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భావోద్వేగాల కంటే ప్రాక్టికల్ నిర్ణయాలే కీలకం కానున్నాయి. మీడియా హడావిడి ఎలా ఉన్నా, ధోని మైదానంలోకి అడుగుపెట్టే ఆ 'మ్యాజికల్ మూమెంట్' కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ధోని గనుక బ్యాట్ పట్టి క్రీజులోకి వస్తే అది ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News