90 డిగ్రీల వంతెనపై యాక్షన్... ఎవరు నాయనా ఆ ఏడుగురు?
మధ్యప్రదేశ్ లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.;

మధ్యప్రదేశ్ లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఆ వంతెనపైనా, దాన్ని నిర్మించిన ఇంజినీర్లపైనా సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్రోల్స్ హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.
అవును... ఎంపీలో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వంతెన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. "ఆ వంతెన డిజైన్ చేసిన, నిర్మించిన ఇంజినీర్లు ఎవరో దయచేసి చెప్పండయ్యా.." అంటూ దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీ డైలాగులతో మీమ్స్ హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
ఇందులో భాగంగా... తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో... మరో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ పైనా శాఖాపరమైన దర్యాప్తనకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్... ఐష్ బాగ్ లో ఆర్.వో.బీ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు.
దానికి సంబంధించిన నివేదిక ఆధారంగా ఎనిమిది మంది పీడబ్ల్యూడీ ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... ఏడుగురు ఇంజినీర్లపై తక్షణమే సస్పెన్షన్ విధించగా... డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్ లను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు తెలిపారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కాగా... మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లోని ఐష్ బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే.. అది ఒక చోట 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఇలా ఎలా డిజైన్ చేశారు, ఎలా నిర్మించారు అంటూ ప్రజలు మండిపడ్డారు.
అయితే... విచిత్రంగా ఈ డిజైన్ ను సదరు నిర్మాణ సంస్థ మాత్రం సమర్థించుకోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత ఉండటం వల్ల ఇలా నిర్మించామని.. అంతకు మించి మరో మార్గం లేదని చెప్పుకొచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది.