మండలి రాజకీయం.. వైసీపీకి ఏదో చేయాలని.. !
శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తాజాగా రాజీనామా చేసిన ఎంఎల్సి లతో భేటీ అయ్యారు. వారి వివరణ తీసుకున్నారు. అయితే ఇది కాస్త రాజకీయ వివాదంగా మారింది.;
శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తాజాగా రాజీనామా చేసిన ఎంఎల్సి లతో భేటీ అయ్యారు. వారి వివరణ తీసుకున్నారు. అయితే ఇది కాస్త రాజకీయ వివాదంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీలను ఆయన తన చాంబర్కి పిలిపించుకుని ప్రశ్నించారని రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మర్రి రాజశేఖర్ విషయంలోకి ఒకింత ఇబ్బందికరంగా వ్యవహరించారనేది టిడిపి నాయకుల మధ్య జరుగుతున్న చర్చ. ఈ విషయం ఇలా ఉంటే. ప్రస్తుతానికి రాజీనామా చేసిన వారిని నిలువరించే ప్రయత్నం చేసినా.. లేక రాజీనామాలను ఆమోదించకపోయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం అయితే కనిపించడం లేదు.
ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత వారిని స్టాండ్ బై లో పెట్టడం ద్వారా ప్రస్తుతానికి వారిని సభకు రాకుండా నిలువరించవచ్చనేది తప్ప ఇంతకు మించి జరిగే కార్యక్రమాలు కూడా ఏమీ పెద్దగా లేవు. పైగా ఎమ్మెల్సీ లను అడ్డుకున్నారన్న వాదన తప్ప మండలి చైర్మన్ కూడా సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయంలో అనవసరమైన రాజకీయానికి తెర తీయకుండా మండలి చైర్మన్ తన హుందాతనాన్ని కాపాడుకుంటేనే బెస్ట్ అనే మాట కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం రిజైన్ చేసిన ఎమ్మెల్సీల విషయానికి వస్తే వీరి భవిష్యత్తు ఏంటి అనేది ఇంకా ఇప్పుడే స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలు మేరకు మోషన్ రాజు వీళ్ళందరినీ విచారించారు. కానీ వారు చేసిన రాజీనామాలు ఆమోదించాలా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. కాబట్టి ఈలోగా విచారణ చేసి తిరస్కరించే అవకాశం ఉంటుంది. లేదా మళ్లీ వివరణ కోరే అవకాశం కూడా ఉంటుంది.
ఎలా చూసుకున్నా ఎమ్మెల్సీల వ్యవహారం డోలాయమానంలోనే ఉందని చెప్పాలి. వైసీపీ నుంచి మండలి కి అడుగుపెట్టిన ప్రజాప్రతినిధులు తర్వాత కాలంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలో శాసనమండలి కి రాజీనామా చేసి పార్టీలు మారిన వారు.. రాజీనామా చేయకుండానే పార్టీ మారిన వారు కూడా ఉన్నారు. వీరి విషయంలో వైసీపీ ఏమీ పట్టుబట్టనప్పుడు.. మండలి చైర్మన్‌గా ఎందుకు సాగదీస్తున్నారన్నది ప్రశ్న. దీనిని ఆమోదించేస్తే.. ఒక రాజకీయ వివాదానికి తెరదించినట్టు అవుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందనేది చూడాలి.