కూల్ న్యూస్ వచ్చేసింది.. 16 ఏళ్ల తర్వాత ఇదే!
ఈ నెల 27న రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని టచ్ చేస్తాయి.;
మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు చల్లటివార్త వచ్చేసింది. వానలు ప్రారంభమయ్యే రోజులు ఎప్పుడో తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. సాధారణంతో పోలిస్తే ఈసారి వానలు ముందే వచ్చేయనున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే.. 2009 తర్వాత షెడ్యూల్ కంటే ముందే వానలు వస్తున్న సంవత్సరంగా నిలవనుంది.
ఈ నెల 27న రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని టచ్ చేస్తాయి. అయితే.. అంతకు ముందే రావటం.. అది కూడా 2009 తర్వాత ఇప్పుడే కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. నిజానికి 2009లో మే 23వ తేదీనే రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జులై 8 నాటికి దేశం మొత్తానికి రుతుపవనాల వ్యాప్తి చెందుతాయి. అదేసమయంలో సెప్టెంబరు 17న వాయువ్య భారతం నుంచి వైదొలగటం మొదలై అక్టోబరు 15 నాటికి ముగుస్తుంది. గత ఏడాది మే 30న.. అంతకు ముందు ఏడాది (2023)లో జూన్ 8న రుతుపవనాలు కేరళను తాకాయి.
రుతుపవనాలు ముందుగా వస్తున్న నేపథ్యంలో వర్షాలు ఈసారి ఎక్కువగా ఉంటాయన్న అంచనాలకు రావటం సరికాదంటున్నారు. రుతుపవనాలు ముందుగా వచ్చినంత మాత్రాన వర్షాలు అధికంగా పడతాయని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు స్పస్టం చేస్తున్నారు. రుతపవనాల రాకకు.. వర్షాలు ఎక్కువగా పడటానిక లింకు లేదని తేల్చి చెబుతున్నారు. కాకుంటే.. రుతుపవనాలు ముందుగా రావటంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎండల తీవ్రత తగ్గటంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందే వీలుంది. కేరళను తాకిన వారం వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు కమ్మేసే వీలుంది. సో.. జూన్ మొదటి వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లుగా చెప్పాలి.