మహారాష్ట్ర అలా చేసిన మోడీషాలు.. బిహార్ లో బుద్ధిగా!
అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే.. కాషాయ జెండా ఎగరటమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీషాలు.. తాము అనుకున్న లక్ష్యానికి అంతకంతకూ దగ్గరవుతున్నారు.;
అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే.. కాషాయ జెండా ఎగరటమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీషాలు.. తాము అనుకున్న లక్ష్యానికి అంతకంతకూ దగ్గరవుతున్నారు. ఒకప్పుడు భారతదేశం రాజకీయ ముఖచిత్రాన్ని చూసి.. బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం భూతద్దం వేసుకొని చూడాల్సి వచ్చేది. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం అతి కొద్ది రాష్ట్రాలు మినహా.. ఎక్కడ చూసినా బీజేపీ జెండా రెపరెపలాడటంతో పాటు.. బీజేపీ ముఖ్యమంత్రులతో నింపేయాలన్న ఆశ వారిలో ఎక్కువే.
ఎవరేం అనుకున్నా.. తమ ఆశను తీర్చుకోవటం కోసం స్నేహాన్ని సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడని తీరు మోడీషాలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపించటం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ - శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం.. అధికార పగ్గాలు తమకు ఇవ్వాలని శివసేన కోరినప్పుడు ఏం జరిగిందో తెలిసిందే. అధికారాన్నివారికి ఇచ్చేందుకు సుతారం ఇష్టపడని మోడీషాలకు షాకిచ్చిన శివసేన అధినేత.. కాంగ్రెస్..ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. ఆ సర్కారును కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు అందరికి తెలిసిన స్టోరీనే.
నాటి అధికార శివసేనను నిలువునా చీల్చేసి.. ఆ చీలిక వర్గంతో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో సక్సెస్ అయిన మోడీషాలు.. ఇందుకు భిన్నమైన తీరును బిహార్ లో ప్రదర్శించటం కనిపిస్తోంది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ 101 స్థానాలు.. జనతాదళ్ (యునైటెడ్) 101 స్థానాల్లో పోటీ చేయటం తెలిసిందే. మిగిలిన స్థానాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్).. రాష్ట్రీయ లోక్ మోర్చా.. హిందుస్థానీ అవామ్ మోర్చాలు పోటీ చేశాయి. మొత్తం 243 స్థానాలకు ఎన్డీయే కూటమి తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.
కాంగ్రెస్ నేత్రత్వంలోని మహాగఠ్ బంధన్ కు దారుణమైన ఓటమి ఎదురయ్యేలా చేసింది. ఎన్డీయేలో బీజేపీ.. నితీశ్ పార్టీలు రెండు సమాన స్థానాల్లో పోటీ చేసినా.. గెలిచిన స్థానాల్ని చూస్తే.. బీజేపీ 89 స్థానాల్లో.. జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. సాధారణంగా మోడీషాల లెక్కల ప్రకారం చూస్తే.. మిత్రపక్షం తమ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినా.. పాలనా పగ్గాలు తమ చేతిలో ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. అలాంటిది బిహార్ లో మాత్రం తామే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన తర్వాత కూడా పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో వెనకడుగు వేయటం.. మిత్రుడిగా ఉన్న నితీశ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
నిజానికి.. బిహార్ పాలనా పగ్గాలు సొంతం చేసుకోవటానికి మోడీషాలు ఆసక్తితో ఉన్నప్పటికీ.. నితీశ్ నుంచి పాలనను తీసుకుంటే.. తమకు సమస్యలు తప్పవన్న సందేహంతోనే.. ఆయన్నే మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. అధికారిక నిర్ణయానికి ముందు కాస్తంత హైడ్రామా చోటు చేసుకోవటం తెలిసిందే. బిహార్ తదుపరి సీఎం నితీశ్ గా పేర్కొంటూ ఆయన పార్టీ జేడీయూ ట్వీట్ చేసింది. కాసేపటికే ఆ పోస్టును డిలీట్ చేసింది. దీంతో.. మహారాష్ట్ర తరహా రాజకీయాల్ని మోడీషాలు ప్రదర్శిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. అయితే.. బుధవారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో నితీశ్ ను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించటంతో.. కొద్ది రోజులుగా బిహార్ తదుపరి సీఎం ఎవరన్న ఉత్కంటకు తెర పడినట్లైంది.
గురువారం బిహార్ తదుపరి సీఎంగా నితీశ్ కుమార్.. ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి.. విజయ్ సిన్హాలు ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో గురువారం ఉదయం 11.30 గంటల వేళలో గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంటోంది.