మోడీ-రేవంత్ ఫొటో రేపిన రచ్చ.. ఏది నిజం!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధిం చిన ఫొటో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫొటో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనాయకులకు చెందిన సోషల్ మీడియాల్లోనే ఈ ఫొటో భారీగా వైరల్ కావడం గమనార్హం. ఈ ఫొటోలో ఉన్న దాని ప్రకారం.. ప్రధాని మోడీ.. కుడిచేత్తో రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఎడమ చేత్తో.. సీఎం రేవంత్ కుడి భుజాన్ని ఆత్మీయంగా తడుతున్నట్టుగా ఉంది.
రేవంత్ చాలా వినయ, విధేయ రాముడిగా.. ప్రధాని ముందు నిలబడి ఉండగా.. నరేంద్ర మోడీ.. చాలా గంభీరమైన ఆత్మవిశ్వాసంతో.. ``మంచి ఫ్యూచర్ ఉంది`` అని అన్నట్టుగా చిరునవ్వుతో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఏముంది? అనేది ఆసక్తికర అంశం. అయితే.. ప్రస్తుతం బీజేపీ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ .. మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టాల్సి ఉన్నా.. పెట్టలేక పోయారు.
దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు.. కారాలు మిరియాలు నూరుతున్నారు. మోడీ వల్లే.. ఇలా జరిగిందని రాహుల్ సైతం ఆరోపించారు. ఓట్ చోరీ గురించే తెలుసునని.. ఇప్పుడు సీట్ చోరీ కూడా చేశారని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ-రేవంత్ ఫొటో వెలుగు చూడడంతో ఇంత జరుగుతున్నా.. మోడీతో రేవంత్ ఇంత ఉల్లాసంగా ఎందుకు కలిశారబ్బా.. దీని వెనుక ఏముందబ్బా.. అన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ సమీకరణలు మారుతాయా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వాస్తవం ఏంటి?
ఇక, వాస్తవం ఏంటి? అనేది కొంత ఆలోచిస్తే.. ఆ ఫొటోనే పట్టిస్తోంది. ఈ ఫొటో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమా వేశం జరిగినప్పుడు తీసిన ఫొటోగా స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమయంలో వారి మెడలో నీతి ఆయోగ్ ట్యాగ్ కూడా వేసుకున్నారు. ఇదే రేవంత్ మెడలో కూడా కనిపిస్తోంది. సో.. నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్లినప్పుడు సహజంగానే ఇతర సీఎంల మాదిరిగానే ఆయన ప్రధానితో భేటీ అయి ఉంటారన్నది సుస్పష్టం.
పోనీ.. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికి దీనికి లింకు ఏమైనా ఉందా? అంటే.. నీతి ఆయోగ్ భేటీకి ముందే నామినేషన్ తిరస్కరణ వివాదం వచ్చింది. అప్పుడే రేవంత్ సీరియస్‌గా ఈ విషయాన్ని ఖండించారు. ఇక, సుప్రీంకోర్టు మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరించింది.. శుక్రవారం. సో.. ఎలా చూసుకున్నా.. రేవంత్ -మోడీల ఫొటోకు.. మీనాక్షి వ్యవహారానికి సంబంధం లేదని సుస్పష్టం అవుతోంది. అయినా.. రాజకీయంగా ఈ వ్యవహారం.. రచ్చగా మారడం గమనార్హం.