ఇద్దరు నేతల సెల్ఫీ సంచలనం

ఎక్కడో స్విచ్ వేస్తే...మరెక్కడో లైటు వెలిగినట్లు....ఇండియాలో మోదీ పుతిన్ ల సెల్ఫీ ఇపుడు అమెరికాలో సంచలనంగా మారింది.;

Update: 2025-12-11 06:39 GMT

ఎక్కడో స్విచ్ వేస్తే...మరెక్కడో లైటు వెలిగినట్లు....ఇండియాలో మోదీ పుతిన్ ల సెల్ఫీ ఇపుడు అమెరికాలో సంచలనంగా మారింది. రష్యాధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనే పాశ్చాత్య దేశాలకు ఓ సెన్సేషన్. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా..భారత్ సంబంధ బాంధవ్యాలంటేనే కడుపు మంట. భారత్ ఎప్పటికీ తన కనుసన్నల్లోనే మెలగాలని ట్రంప్ కోరిక. అయితే వర్ధమాన దేశంగా సముజ్వలంగా వెలుగుతున్న భారత్ ఎప్పటికీ ఒకరి చేతిలో కీలుబొమ్మ కాదు...కాబోదని ఇటీవల విదేశాంగమంత్రి జైశంకర్ మీడియాముఖంగానే ప్రకటించారు. భారత్ ఎవరితో స్నేహం చేయాలన్న విషయాలు మరొకరితో చెప్పించుకునే స్థితలో లేదు అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రష్యాధ్యక్షుడు పుతిన్...భారత్ ప్రధాని మోదీ నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ అమెరికాలో హాట్ హాట్ టాపిక్ గా మారుతోంది.

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న సమయంలోనే ....అమెరికా అధ్యక్షుడు భారత్ ను రష్యాతో చమురు కొనుగోలు చేయొద్దని ఆక్షేపిస్తూ ప్రతీకార ఎగుమతి సుంకం విధించిన నేపథ్యంలోనే రష్యాధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యంగా మారుతోంది. ఈ పర్యటన వల్ల ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టంగా మారుతాయన్న ఆశాభావాన్ని ఇరుదేశాధినేతలు వ్యక్తం చేశారు. అయితే ఇదే సందర్బంగా పుతిన్ భారత్ లో దిగిన వెంటనే మోదీ ఎదురేగి ఆప్యాయంగా కౌగిలించుకోవడం...ప్రొటోకాల్ ను పక్కన పెట్టేయడం చర్చగా మారింది. అలాగే ఇద్దరూ కారులో ప్రయాణం చేస్తూ తీసుకున్న సెల్ఫీ ఇపుడు అమెరికా రాజకీయాల్లో కాక రేపుతోంది.

మోదీ పుతిన్ లు తీసుకున్న సెల్ఫీ కోటి అర్థాలను వ్యక్తం చేస్తోందని అగ్రరాజ్య చట్టసభ సభ్యురాలు సిడ్నీ కమ్ లాగర్ దువ్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్బఁంగా భారత్ పై ట్రంప్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ట్రంప్ దుందుడుకు వైఖరి వల్లే భారత్...అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధం, అవగాహన దారుణంగా దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామిని శత్రువు చేతిలో పెట్టడం ద్వారా ట్రంప్ కు నోబెల్ రాదని వ్యంగ్యాస్త్రం సంధించారు.

అమెరికా అధ్యక్షుడు భారత్ పై వ్యవహరిస్తున్న తీరు చాలా మంది అమెరికన్లకే నచ్చడం లేదు. ఏదో అమెరికాను ప్రౌడ్ చేస్తారని రెండోసారి అధికారం కట్టబెట్టినందుకు ఇపుడు వారు తలలు పట్టుకుంటున్నారు. వలస ప్రజలపై అమెరికా గంటకో ప్రకటన చేస్తుండటం...అది భారత్ ను ప్రత్యక్షంగా ఇబ్బందిపెడుతుందని, తద్వారా అది దారిలోకి వస్తుందని ట్రంప్ అనుకుంటుండటమే పొరపాటని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో చిరకాల మిత్రులైన రష్యాతో భారత్ తాజాగా చెట్టా పట్టాలేసుకోవడం అమెరికన్లకు మరింత బాధ కలిగిస్తోంది.

అమెరికాలో భారత్ జనాభా గణనీయంగా పెరుగుతోంద. కొన్ని రాష్ట్రాల్లో ఇండియన్స్ ఎన్నికల్లో నిర్ణయాత్మక ఓటర్లుగా ఉంటున్నారు. అలాంటిది ఇపుడు హెచ్ 1బీ వీసాలు, సిటిజన్ షిప్, గ్రీన్ కార్డ్ తదితర అంశాలను భద్రతా కారణాలు చూపి కఠినతరం చేయడం సరికాదని అమెరికన్ల అభిప్రాయం. ఆ కారు రైడ్ నా ఆలోచన...భారత్ తో మా స్నేహానికి అది గుర్తు. కారు ప్రయాణంలో మేం మాట్లాడుకంటూనే ఉన్నాం అంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు అమెరికాకు పుండుమీద కారంచల్లినట్లుంటోంది.

Tags:    

Similar News