మోదీ ఇన్‌స్టా పోస్ట్ కోసం అల్లూ ఫ్యాన్స్ వర్సెస్ తంబీ ఫ్యాన్స్ కొట్లాట!
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుత రోజుల్లో రాజకీయ నాయకులు తమ సోషల్ మీడియా పోస్టులను సాధారణ ప్రజలకు మరింత సులభంగా చేరవేయడానికి.. ఎక్కువ రీచ్ సంపాదించడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాల్లోని పాపులర్ పాటలను తమ ఇన్‌స్టా రీల్స్, పోస్టుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించడం ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు `దురంధర్` సినిమా పాటను వాడటం మనం చూశాం. అదేవిధంగా ఇతర దేశాల రాయబార కార్యాలయాలు సైతం భారతదేశానికి సంబంధించిన పోస్టులకు బాలీవుడ్, సౌత్ సినిమాల పాటలను జోడిస్తూ ఇక్కడి నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యూరప్ దేశమైన స్లోవేకియా తనను ఒక ప్రత్యేక పురస్కారంతో గౌరవించినందుకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ.. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ ఇన్‌స్టా పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న AA23 చిత్రం (దర్శకుడు లోకేష్ కనగరాజ్) లోని ఒక పాటను మోదీ డిజిటల్ టీమ్ ఉపయోగించింది. ఈ పోస్ట్ బయటకు వచ్చిన క్షణం నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు అభిమానుల యుద్ధానికి వేదికగా మారాయి.
ప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఆ పాటను ఉపయోగించడంతో.. అల్లు అర్జున్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరిందని.. అందుకే మోదీ టీమ్ ఆ పాటను ఎంచుకుందని తెలుగు అభిమానులు సోషల్ మీడియాలో గర్వంగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన తమిళ సినీ అభిమానులు ఆ వాదనను ఖండించారు. ఏఏ23 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని.. ఇది అల్లు అర్జున్ క్రేజ్ కాదు.. కేవలం అనిరుధ్ మ్యూజిక్ పవర్‌కు దక్కిన గౌరవమంటూ తమిళ నెటిజన్లు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా క్రెడిట్ (కీర్తి) కోసం ఇరు భాషల అభిమానుల మధ్య మొదలైన ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర రూపం దాల్చింది.
ఈ ఫ్యాన్ వార్ మరీ శృతిమించడంతో అలర్ట్ అయిన పీఎం మోదీ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ వివాదాస్పద పాటను కేవలం మొబైల్ వెర్షన్‌లో మాత్రమే వినిపించేలా సెట్ చేసి, డెస్క్‌టాప్ (కంప్యూటర్) వెర్షన్‌లో దాన్ని నిలిపివేసింది. అయితే ఒక అంతర్జాతీయ సందేశం ఉన్న చోట ఇలా అభిమానులు ఘర్షణ పడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామెంట్ సెక్షన్ లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఘర్షణ పడటం నిజంగా చూపరులకు ఛీప్ గా కనిపించింది.
గతంలో హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు కూడా.. ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోల అభిమానులు కామెంట్ సెక్షన్‌లో ఇలాగే ఘర్షణ పడి తెలుగువారి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చారు. అయితే ఇలాంటి ఫ్యాన్ వార్ లో ప్రాంతాల వారీగా తెలుగు- తమిళం అంటూ కొట్టుకోవడం చూస్తుంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో తీరని మచ్చగా మారుతుందనంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వేదికలపై తెలివి తక్కువ ఫ్యాన్ వార్స్ పరువు తీయడం సరికాదని హితవు పలుకుతున్నారు.