మోడీ ఏం చేయబోతున్నారు ?

నరేంద్ర మోడీ పట్టుదల కలిగిన వారు ఓటమి ఎరగని వీరుడు. ఆయన అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.;

Update: 2026-04-18 03:48 GMT

నరేంద్ర మోడీ పట్టుదల కలిగిన వారు ఓటమి ఎరగని వీరుడు. ఆయన అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. దాంతో మూడు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ బిల్లు కూడా ఆమోదం పొందుతాయని అంతా అనుకున్నారు. తీరా చూస్తే బొక్క బోర్లా అయినట్లుగా సీన్ కనిపించింది. ఒక విధంగా ప్రతిష్టగా తీసుకున్న మోడీ ప్రభుత్వానికి ఇది దెబ్బ అని అంతా అంటున్నారు. విపక్ష నేతలు కొందరు అయితే బీజేపీ ఎన్నికల కోసం రాజకీయ వ్యూహంగా దీనిని తెచ్చిందని అందుకే బెడిసికొట్టిందని అంటున్నారు.

కిం కర్తవ్యం అంటే :

ఒక పెద్ద ఎదురు దెబ్బ అయితే ఎన్డీయే ప్రభుత్వానికి కేంద్రంలో తగిలింది. పార్లమెంట్ వేదికగా విపక్షాలు సాధించిన తొలి విజయంగా అంతా అంటున్నారు. అయితే పార్లమెంట్ లో అనేక బిల్లులు వీగిపోవడం జరుగుతూ ఉంటాయి. మెజారిటీ లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన బిల్లుల విషయంలో హౌస్ కో ఆర్డినేషన్ అన్నది చాలా ముఖ్యం. ఆ విషయంలో బీజేపీ చతికిలపడినట్లు అయింది. అయినా సరే మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతున్నారు.

ఈ ఓటమి తొలిసారి :

ఇదిలా ఉంటే దేశంలోని లోక్‌సభ శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని పొందడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇది రాజ్యాంగ సవరణ కావడంతో, దీనికి సాధారణ మెజారిటీ కాకుండా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అలా పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులలో ఓడిపోయిన విషయంగా ఇదే మొదటి సారి. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాల విషయంలో అడ్డంకులను ఎదుర్కొంది. మోడీ 2014లో అధికారం చెపట్టాక భూసేకరణ చట్టం, రెండవ పదవీకాలం ప్రారంభంలో వ్యవసాయ చట్టాలు వంటివి కూడా ఉన్నాయి. అయితే అపుడు రాని అభ్యంతరాలు ఇపుడు వచ్చాయి. అంతే కాదు అఓటింగ్‌కు పెట్టిన ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేయడంలో విఫలమవడం ఇదే తొట్ట తొలిసారి.

గతంలో ఇలాగే జరిగింది :

ఇక కేవలం మోడీ మాత్రమే కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు కూడా మెజారిటీ లేక వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉగ్రవాద నిరోధక చట్టం బిల్లు కూడా వీగిపోయింది. అయితే ఇది రాజ్యసభలో ఓడిపోయినప్పటికీ ఆనాటి వాజ్ పేయ్ ప్రభుత్వం చివరికి సంయుక్త సమావేశం ద్వారా దానిని ఆమోదింప చేసుకుంది. అదే విధంగా చూస్తే పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించే 64వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా మరో సందర్భంలో రాజ్యసభలో ఓడిపోయింది. దీనిని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని 73వ సవరణగా ఆమోదించింది.

ఇవన్నీ భయాలు :

ఇదిలా ఉంటే అనేక భయాలు సందేహాలు మధ్య లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. అందులో ఒక కారణం అయితే డీలిమిటేషన్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ఒక వివాదాస్పద అంశంగా చివరిదాకా కొనసాగుతూ వచ్చింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన పెద్ద ఎత్తున ఉంది. అలాగే 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన అన్నది కూడా రాజకీయంగా బీజేపీ పదునైన వ్యూహం అన్న భయాలు విపక్షాలలో ఉన్నాయి.

అప్పుడేనా :

ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లు అన్నది ఇప్పట్లో సభ ముఖం చూసే అవకాశం అయితే లేదు అని అంటున్నారు. మరి ఎపుడు అంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల తర్వాత మరోసారి మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ బిల్లుని తెచ్చే చాన్స్ ఉంది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ నుండి వేరు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని అంటున్నారు.

Tags:    

Similar News