మోడీకి తొలి షాక్-విపక్ష కూటమి సక్సెస్
రోజులు ఎప్పుడూ ఒక్కటిగా ఉండవు. రాజకీయాల్లో అసలు ఉండవు. ఎంతటి అపర చాణక్యుడు అయినా ఓటమి తప్పదు.;
రోజులు ఎప్పుడూ ఒక్కటిగా ఉండవు. రాజకీయాల్లో అసలు ఉండవు. ఎంతటి అపర చాణక్యుడు అయినా ఓటమి తప్పదు. ఇపుడు అదే జరిగింది.గత పుష్కర కాలంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్న నరేంద్ర మోడీ కత్తికి ఎదురు లేకుండా పోయింది. బలం లేకపోయినా ఎన్నో బిల్లులు చాలా సులువుగా పాస్ అయిపోయాయి. అంతే కాదు రాజ్యాంగ సవరణ చేస్తూ అనేక నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకోగలిగింది. అసలు అసాధ్యం అనుకున్న జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. ఒక్క రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. ఈ రోజుకీ కేంద్ర పాలిత ప్రాంతాలుగానే జమ్మూ లఢక్ ఉన్నాయి.
ఐక్యంగా ఉంటూ :
అదే తీరులో మహిళా బిల్లు రిజర్వేషన్లు డీలిమిటేషన్ తో ముడిపెట్టి దానిని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మరీ ఆమోదించుకోవాలని బీజేపీ ఎంతో తాపత్రయ పడింది. అయితే సమయం సందర్భం కూడా బీజేపీ రాజకీయ వ్యూహాలను విపక్షాలు పసిగట్టి కలసికట్టుగా ఉండేలా చేశాయి నిజానికి ఒక వైపు దేశంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు జనాభా గణన అన్నది 2027 మధ్యలో ముగుస్తుంది. అంటే గట్టిగా ఏడాది అన్న మాట. ఈ మధ్యలో కుల గణన కూడా డిమాండ్ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అందరితో సంప్రదించి చేసి ఉంటే గతంలో మాదిరిగా బీజేపీ పెట్టిన బిల్లులకు ఆమోదముద్ర పడేది. కానీ తమకు ఎదురు లేదని కేంద్ర పెద్దలు అనుకున్నారో లేక విపక్షాలలో అనైక్యత తమకు కలసి వస్తుందని భావించారో తెలియదు కానీ మొత్తానికి బిల్లు వీగిపోయింది. భారీ షాక్ మోడీ ప్రభుత్వానికి ఈ రూపంలో తగిలింది.
స్వయంకృతాపరాధమే :
ఎంతో ప్రతిష్టాత్మకమైన మహిళా బిల్లు లోక్ సభలో వీగిపోవడం బీజేపీ స్వయంకృతాపరాధం అనే అంటున్నారు. బీజేపీ అందరితో సంప్రదించి చేసి ఉంటే ఒక్క లెక్కగా ఉండేది. అది కూడా ఇపుడు కాదు, జనాభా గణన పూర్తి కావాలి దేశంలో పెద్ద లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి చిన్నవిగా చేయాలి. సీట్ల పెంపు మీద ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ చేసే విధానం మీదనే అందరూ విమర్శిస్తున్నారు.
బొటా బొటీ మెజారిటీ :
మూడవసారి 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ అన్నది లేదు, 240 నంబర్ దగ్గర ఆ పార్టీ ఆగిపోయింది. మిత్రుల మద్దతుతో సాధారణ మెజారిటీతో ప్రభుత్వం నడుపుతోంది. అలాంటి సమయంలో ఈ విధంగా రాజకీయ దూకుడు పనికి రాదు అని అంటున్నారు. మరో వైపు విపక్షాల బలం 2024 ఎన్నికల్లో పెరిగింది. దాంతో పాటు వారిలో కసి కూడా పెరిగింది. అంతా ఒక్క మాట మీద ఉంటున్నారు దానికి కారణం బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వ విధానాలే అని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమకు బలం లేకపోయినా విపక్షాలను ఆకట్టుకుని బిల్లు పాస్ చేయించుకోవాలనుకున్న బీజేపీ వ్యూహం అనాలో అతి తెలివి అనాలో అది వీగిపోయింది.
ఎన్డీయేకి ఆరంభం మాత్రమే :
ఎన్ డీయేకు ఇది ఆరంభం మాత్రమే అని విపక్ష నేతలు అంటున్నారు. ఇక ముందు చాలా చూడాలని అంటున్నారు. విపక్షాల విశ్వాసం తీసుకోకుండా అతి ఉత్సాహం చూపిస్తే ఈ తరహా షాకులే తగులుతాయని అంటున్నారు. మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది అంటే దానికి కారణం బీజేపీ పెద్దల అతి వ్యూహాలే అని అంటున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మరో వైపు గత పుష్కర కాలం చూడని సరికొత్త అనుభవం ఎన్డీఏకు ఎదురైంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు అన్నీ ఏకం కావడం ఎన్ డీయేకు గట్టి సవాల్ అని అంటున్నారు. రానున్న కాలంలో ఇదే తీరులో అంతా కలసి ఉంటాయన్నది అర్ధం అవుతోంది. దాంతో ఎన్డీయేకు గడ్డు కాలమే అని చెబుతున్నారు.