మారిన అంతర్జాతీయ రాజకీయం.. మోడీకి ట్రంప్ పిలుపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాకుండా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి కూడా మోదీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.;

Update: 2025-10-12 10:30 GMT

అంతర్జాతీయ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన శాంతి ఒప్పందంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ సమావేశం ఈజిప్టు వేదికగా జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

* ఆహ్వానం వివరాలు

ఇజ్రాయెల్, హమాస్‌లు ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళిక మొదటి దశకు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో బందీల విడుదల, ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాలు.. తదుపరి చర్యల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాకుండా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి కూడా మోదీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

గాజా శాంతి ప్రణాళిక విజయంపై ప్రధాని మోదీ ఇప్పటికే ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఒప్పందం శాశ్వత శాంతికి తొలి అడుగు అని ఆయన అభివర్ణించారు.

* అంతర్జాతీయంగా భారత్ పాత్ర

ప్రపంచ శాంతి , స్థిరత్వానికి భారత్ ఎల్లప్పుడూ ఇస్తున్న మద్దతును అమెరికా గుర్తించిన నేపథ్యంలో మోదీకి ఈ ఆహ్వానం అందింది. మధ్యప్రాచ్య సమస్యపై భారత్ తీసుకుంటున్న సమతుల్య వైఖరిని అంతర్జాతీయ సమాజం ప్రశంసిస్తోంది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో భారత్ భాగస్వామ్యం కావడం, ఈ అంతర్జాతీయ వేదికపై దేశం ప్రాధాన్యతను పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే అంశంపై భారత ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News