0వేల జనాభా లేని దేశాలకు పర్యటనలా?... మోడీకి సెటైర్లు!

ప్రధాని మోడీ ఐదు దేశాల (ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-11 05:35 GMT

ప్రధాని మోడీ ఐదు దేశాల (ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే... మోడీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్.. ప్రధాని పర్యటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రధాని వరుస విదేశీ పర్యటనలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటిని చక్కబెట్టుకోకుండా ఊరిని చక్కబెడతానన్నట్లుగా ప్రధాని వైఖరి ఉందనే అర్ధం వచ్చేలా వారు విమర్శిస్తున్నారు! 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశాన్ని, ఇక్కడి సమస్యలను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోడీ పర్యటిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్... ప్రధాని ఘనా అని ఎక్కడికో వెళ్లారు.. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం అని అన్నారు. ఈ నేపథ్యంలో... ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలని.. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ప్రధాని ఉండరు కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయని మాన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కూడా మోడీ విదేశీ పర్యటనలపై విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... ప్రధాని మరో పర్యటనకు వెళ్లేలోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో అంటూ.. ఇప్పుడైనా మణిపుర్‌ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో లేదో అంటూ ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి దోషులను ఇప్పటివరకు న్యాయస్థానం ముందు ఎందుకు నిలబెట్టలేదో కూడా ఆయన సమీక్ష చేయొచ్చని అన్నారు. దీంతో.. ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇంటిని చక్కబెట్టుకోవడం కూడా ముఖ్యమేగా అనే స్పందనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో విదేశాంగ శాఖ స్పందించింది.

ఇందులో భాగంగా... ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్‌ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. భారత్‌ తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని చెప్పుకొచ్చింది!

కాగా... ప్రధాని మోడీ పర్యటించిన దేశాల జనాభాలు ఈ విధంగా ఉన్నాయి!

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో - 13.7 లక్షలు

నమీబియా - 27.7 లక్షలు

అర్జెంటీనా - 4.55 కోట్లు

ఘనా - 3.38 కోట్లు

బ్రెజిల్‌ - 21.11 కోట్లు

Tags:    

Similar News