ఆసక్తికరంగా మారిన మోడీ చైనా టూర్.. దానికి ముందే జపాన్ పర్యటన ఎందుకు?
కాలం మారుతోంది. మారే కాలానికి అనుగుణంగా మార్పులు అవసరం. భారత విదేశాంగ విధానంలోనూ అది అత్యంత అవసరం.;
కాలం మారుతోంది. మారే కాలానికి అనుగుణంగా మార్పులు అవసరం. భారత విదేశాంగ విధానంలోనూ అది అత్యంత అవసరం. కాల పరీక్షలో కొన్ని దేశాలతో స్నేహం.. మరికొన్ని దేశాలతో శత్రుత్వం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది అర్థమవుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా వర్తమానంలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. చాలామందికి రుచించకపోవచ్చు కానీ.. నిత్యం అమెరికా మీద ఆధారపడుతూ.. అగ్రరాజ్యం చెప్పే మాటల్ని వింటూ.. వారి ఆదేశాల్ని కొంతమేర పాటిస్తూ.. అణిగిమణిగి ఉంటూ.. స్నేహ హస్తాన్ని అనుక్షణం చాచాల్సిన అవసరం ఏముంది?
వాళ్లింటికి మన ఇల్లు ఎంత దూరమో.. అంతే దూరం మన ఇంటి నుంచి వాళ్లింటికి కూడా. కాకుంటే.. అగ్రరాజ్యం కావటంతో ఇళ్ల ఉదాహరణ చెప్పినంత ఈజీ కాదు. అయితే.. మారుతున్న అగ్రరాజ్య ఆలోచనలకు తగ్గట్లే భారత్ కూడా తన విదేశాంగ విధానానికి సంబంధించిన వ్యూహాలను కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా స్నేహం కోసం తపించినంత కాకున్నా.. చైనాతో సంబంధాల్ని పునరుద్ధించుకోవటం.. అగ్రరాజ్యం ఆత్మరక్షణలో పడేలా భారత్ ఎందుకు వ్యవహరించకూడదన్న మాట కొందరి నోట ఈ మధ్యన వినిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎలా అయితే తన దేశం.. తన దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు.. భారత ప్రధాని కూడా అలాంటి ఆలోచనే చేస్తారు కదా? తన దేశ ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాల విషయంలో ట్రంప్ వ్యవహరించే తీరు చూసిన తర్వాత.. మనం అమెరికా స్నేహం కోసం తపించే కన్నా.. చైనాతో ఉభయ కుశలోపరి టైపులో బంధాన్ని షురూ చేస్తే బాగుంటుంది.
ఇలాంటి ఆలోచన మోడీ సర్కారుకు కూడా వచ్చిందా? లేదంటే.. ఆ దిశగా ఒక అడుగువేయాలనుకుంటున్నారా? అన్న దాని మీద స్పష్టత లేదు కానీ.. గతానికి మించిన మంచి ఎజెండాతో చైనా పర్యటనకు మోడీ ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ఆయన చైనా పర్యటించే డేట్లు దాదాపు ఖరారైనట్లే. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటో తేదీన చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకరా సంస్థ సదస్సులో పాల్గొనే ప్రధాని మోడీ.. ఈ పర్యటనలో భాగంగా చైనా అధినేత షీ జిన్ పింగ్ తోనూ భేటీ అవుతారని చెబుతున్నారు.
2019లో మోడీ చివరిసారి చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో భారత - చైనా సైనికుల మధ్య జరిగిన పోరు.. తదనంతర పరిణామాలు తెలిసిందే. అప్పటినుంచి చైనాతో భారత్ దౌత్య సంబంధాలు ఏ మాత్రం బాగోలేవు. తాజాగా వాటికి పుల్ స్టాప్ పెట్టి.. మళ్లీ రెండు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరణకు మోడీ టూర్ పనికి వస్తుందని భావిస్తున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా తాజాగా భారత విదేశాంగ మంత్రి చైనాకు వెళ్లటం.. అధినేత జిన్ పింగ్ తో భేటీ కావటం తెలిసిందే.
ఈ క్రమంలో ఆగస్టులో మోడీ చైనా పర్యటన వేళకు..అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారన్న మాట వినిపిస్తోంది. అయితే.. చైనా టూర్ కు వెళ్లటానికి ముందు జపాన్ వెళ్లాలన్న యోచనలో మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకు? అంటే.. తన చైనా పర్యటనకు సంబంధించిన అంశాలు.. తమ ఎజెండాను మిత్రుడైన జపాన్ కు చెప్పుకోవల్సిన అవసరం ఉంది. ఎందుకంటే..చైనాకు, జపాన్ కు మధ్య పంచాయితీల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జపాన్ పర్యటనలో చైనా టూర్ కు సంబంధించిన అంశాలను ఆ దేశాధినేతకు మన ప్రధాని మోడీ వివరించే వీలుందని చెబుతున్నారు.
మరోవైపు ఆగస్టులో మోడీ చైనా టూర్ ను చూసినప్పుడు.. భారత ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇప్పటివరకు ఐదుసార్లు చైనా పర్యటించారు. అదే సమయంలో తన రెండు టర్మ్ లతోకలిసి ఇప్పటివరకు విదేశాల్లో చైనా అధినేతతో ప్రధాని మోడీ 18సార్లు సమావేశమైనట్లుగా చెప్పాలి. మొత్తంగా మోడీ చైనా పర్యటన కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.